బోయపాటి ఇలా చేశాడేంటి?

వరుసగా దుమ్ము రేపే మాస్‌ సినిమాలను తెరకెక్కించి ఇటీవలే అల్లు అర్జున్‌తో ‘సరైనోడు’ అంటూ సరైన మాస్‌ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను ఇచ్చి, టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో ‘సరైనోడు’ చిత్రాన్ని నిలిపిన దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో శ్రీనివాస్‌ సినిమా అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి సినిమాతోనే గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి తన స్థాయిని నిరూపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సినిమాతో దుమ్ము రేపడం ఖాయం అనుకున్నారు.

మాస్‌ హీరోగా పేరు తెచ్చుకుని, మాస్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న బెల్లంకొండ హీరోతో బోయపాటి షాకింగ్‌గా క్లాస్‌ సినిమా తెరకెక్కించినట్లుగా తాజాగా రిలీజ్‌ అయిన టైటిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటి వరకు బోయపాటి చేసిన సినిమాల టైటిల్స్‌కు ఈ సినిమా టైటిల్ ఎక్కడ పొంతన లేకుండా ఉన్నాయి. గతంలో చేసిన సినిమాలు అన్ని కూడా టైటిల్‌లోనే మాస్‌ను కనబర్చాయి. కాని తాజాగా తెరకెక్కిస్తున్న సినిమాకు ‘జయ జానకి నాయక’ టైటిల్‌ పెట్టి షాక్‌ ఇచ్చాడు. టైటిల్‌ను చూస్తుంటే ఇదేదో క్లాస్‌ సినిమాలా అనిపిస్తుంది.

బోయపాటి శ్రీను విభిన్నంగా ఆలోచించి టైటిల్‌ను ఖరారు చేశాడా లేక, సినిమా కథకు తగ్గట్లుగా టైటిల్ పెట్టాడా అనేది తెలియాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం టైటిల్‌ క్లాస్‌గా ఉన్నా సినిమా మాత్రం మాస్‌గానే ఉంటుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తుంది. ఒక స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్‌ చేయబోతుంది. తన గత చిత్రాల మాదిరిగానే బోయపాటి ఈ సినిమాను మాస్‌గా తెరకెక్కిస్తాడని, కాకుంటే టైటిల్‌ విషయంలో కాస్త విభిన్నంగా ఆలోచించాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

To Top

Send this to a friend