అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘డీజే’ చిత్రంలోని గుడిలో బడిలో.. పాటలోని కొన్ని పదాలపై బ్రహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో స్వయంగా హరీష్ శంకర్ స్పందించి తనకు బ్రహ్మణులను అవమానించే ఉద్దేశ్యం లేదని, ఆ పదాలు ఇబ్బందిగా అనిపిస్తే తప్పకుండా తొలగిస్తామని ప్రకటించాడు. అయితే తాజాగా విడుదలైన ఆడియో సీడీల్లో సవరించకుండానే ఆ పాట ఉంది.
ఆడియో విడుదల తర్వాత మళ్లీ పాట వివాదం మొదటికి వచ్చింది. బ్రహ్మణ సంఘాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో మరోసారి హరీష్ శంకర్ స్పందించాడు. తాము అన్నట్లుగానే పాటలోని ఆ పదాలను తొలగించడం జరిగింది. అయితే అప్పటికే తయారు అయిన ఆడియో సీడీలను ఏం చేయలేక పోయాం. రెండవ దఫా విడుదల కానున్న ఆడియో సీడీల్లో ఆ పదాలు ఉండవని హామీ ఇస్తున్నామన్నాడు. సినిమాలో కూడా ఆ పదాలు లేకుండానే పాట ఉంటుందని హామీ ఇచ్చాడు.
మొదట చెప్పినట్లుగానే ఆ పదాలు తొలగించలేక పోయాం. తప్పు జరిగింది, క్షమించండి అంటూ హరీష్ శంకర్ మీడియా ముందు బ్రహ్మణ సంఘాలకు విజ్ఞప్తి చేశాడు. ఈనెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే సినిమాలో ఆ పదాలను తొలగించి, వేరే పదాలను రిప్లేస్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. విడుదల తర్వాత ఈ సినిమా ఎంతటి వివాదాలకు కేంద్ర బింధువు అవుతుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
