బుల్లెట్‌ దూసుకు రాలేదు

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలోని ఆరడుగుల బుల్లెట్‌ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పాట అంతగా పాపులర్‌ అవ్వడంతో అదే టైటిల్‌తో తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రంపై అంచనాలు భారీగా వచ్చాయి. గోపీచంద్‌ హీరోగా బి గోపాల్‌ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు విడుదల అవ్వాల్సి ఉంది. కాని ఆర్థిక సమస్యల కారణంగా సినిమా విడుదల కాలేదు.

సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి కూడా ఒక ఎన్నారై ఫైనాన్సియర్‌ మీడియాతో మాట్లాడుతూ ఆ చిత్ర నిర్మాత సి కళ్యాణ్‌ తనకు ఆరు కోట్ల రూపాయలను ఇవ్వాలని, ఆ డబ్బు ఇచ్చిన తర్వాతే చిత్రాన్ని విడుదల అవ్వనిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాత కళ్యాణ్‌ మాత్రం ఆ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సినిమాను విడుదలకు సిద్దం చేశాడు. కాని చివరి నిమిషంలో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

నేడు థియేటర్లలో సినిమా ఆడుతుందని నిన్న సాయంత్రం వరకు కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు థియేటర్ల యాజమాన్యం ప్రకటించింది. అయితే నేడు ఉదయం ఆట పడలేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఎన్నారై ఫైనాన్సియర్‌తో చర్చలు జరిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కొందరు మాత్రం ఈ సినిమా విడుదల ఇక సాధ్యం కాదని, గోపీచంద్‌ కెరీర్‌లో ఇదో బ్లాక్‌ మార్క్‌ చిత్రంగా మిలిగి పోతుందని విశ్లేషకులు అంటున్నారు.

To Top

Send this to a friend