ఏవండోయ్.. ఇది విన్నారా..?

– చిరంజీవి లాంటి అన్నయ్య ఉంటే కొట్టేవాడేమో..
-నాగబాబు మాటలతో వదిలేశాడు..: రాంగోపాల్ వర్మ
ఈ ఉదయం ఏ భోది వృక్షం కింద కూర్చున్నాడో ఏమో కానీ ఒక్కసారి బుద్దిమాద్యం పోయి వర్మకు జ్ఞానోదయమైంది. తాను ఇది వరకు తిట్టిన వారందరికి క్షమాపణలు చెబుతున్నాడు. ఇదెంత కాలమో తెలియదు కానీ.. ఈరోజు పొద్దుపొద్దునే ఓ సంచలన వ్యాఖ్య చేశారు.. ట్వీట్స్ తో ఎప్పుడు తెలుగు హీరోలను తిట్టి తలనొప్పిగా మారిన వర్మ ఇప్పుడు తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఇటీవలే తల్లిపై, అమితాబ్ పై, స్పీఫెన్ స్పీల్ బర్గ్ పై ఒట్టేసి ఇక నుంచి ఎవరినీ తిట్టనని వ్యాఖ్యానించాడు.

తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ మెగా అభిమానులను శాంతపరిచింది. ఇటీవలే పవన్ ఫ్యాన్స్ కు, గణపతి భక్తులకు సారీ చెప్పిన వర్మ ఇప్పుడు నాగబాబుకు కూడా సారీ చెప్పారు. వర్మ ట్వీట్ చేస్తూ .. ‘చిరంజీవి గారి లాంటి అన్నయ్య నాకుంటే.. నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడేమో.. నాగబాబు గారు మాటలతో వదిలేశారు. రియల్లీ సారీ టు నాగబాబు’ అని ట్వీట్ చేశాడు.

వర్మలో ఒక్కసారిగా ఈ మార్పు ఏంటో అర్థం కాక ట్విట్టర్ ఫాలోవర్స్ షాక్ అవుతున్నారు. వర్మ గతంలో నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశాడు. ఖైదీ నంబర్ 150 మూవీలో నాగబాబు వర్మను అక్కుపక్షి అని తిట్టాడు. దీనికి ప్రతిగా వర్మ నాగబాబును ట్విట్టర్ లో చాలా తిట్లు తిట్టాడు. ఇప్పుడు దానికి సారీ చెప్పాడు. వర్మలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉండాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. కానీ గిల్లితే గిల్లించుకునే వర్మ కలకాలం ఇలానే శాంత పురుషుడిగా ఉంటాడో లేదో కాలమే చెబుతుంది.

To Top

Send this to a friend