వాళ్లు చేసేది సంసారం.. మిగతా వాళ్లది.?


ఓ సామాన్యుడు ఏపీ ప్రభుత్వాన్నే కదిలించాడు. ఓ సామాన్యుడిని అరెస్ట్ చేసేందుకు ఏకంగా ఏపీ సీఎం ఆదేశించారంటే ఆ పోస్టుల వెనుక ఉన్న దమ్మును అర్థం చేసుకోవచ్చు.. రాజకీయ పార్టీలపై విమర్శలు సహజం.. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు విమర్శల్ని భరించాలి. తెలంగాణ ఉద్యమంలో ఉండగా.. కేసీఆర్ చాలా అవమానాలు పొందాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అలా అని అధికారంలోకి రాగానే వాళ్లపై కేసీఆర్ ప్రతికారం తీర్చుకోలేదు కదా..

కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తనపై, తన కొడుకుపై వచ్చిన విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు. వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేస్తున్నారని ఏపీ పోలీసులను ఆదేశించి పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ నిర్వాహకుడు రవికిరణ్ ను అక్రమంగా పక్కరాష్ట్రంలో అదీ తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండా వెళ్లి అరెస్ట్ చేశారు.

దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో తెలంగాణ పోలీసులు తమ అనుమతి లేకుండా తమ ప్రాంతాల్లో అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రవికిరణ్ భార్య తన భర్తను ఏపీ పోలీసులు అపహరించారని హైకోర్టులో పిటీషన్ వేయడానికి సిద్ధమైంది. దీంతో దెబ్బకు దిగొచ్చిన ఏపీ పోలీసులు రవికిరణ్ ను శనివారం తెల్లవారుజామున శంషాబాద్ లోని ఆయన ఇంట్లో వదిలిపెట్టారు. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్టానుసారంగా అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు అది తప్పు అని తేలడంతో శనివారం రవికిరణ్ ను అంతే రహస్యంగా హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో వదిలిపెట్టారు.

సోషల్ మీడియాలో కేవలం రవికిరణ్ మాత్రమే టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం లేదు. అదే పనిని టీడీపీ అధికారిక వెబ్ సైట్ కూడా చేస్తోంది. తెలుగుదేశం ఫేస్ బుక్ పేజీలో చంద్రబాబు, కేసీఆర్ ను అవమానించేలా ఎన్నో పోస్టులు ఉన్నాయి. వాటన్నింటితో ఇతరులను అవమానిస్తున్న చంద్రబాబు.. తన దాకా వస్తే మాత్రం నిబంధనలు, అవమానాలు, సోషల్ మీడియా పెచ్చరిల్లడం అంటూ నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

To Top

Send this to a friend