ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందునా వేసవిలో ఉల్లిపాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎండవేడిమికి వడదెబ్బ కొట్టే సూచనలున్నా ఉల్లిపాయ వాసన చూస్తే మంచిది అంటారు. అంతేకాదు, ఉల్లిపాయ అనేక రకాల క్యాన్సర్లను తగ్గిస్తుందనీ చర్మసౌందర్యాన్నీ పెంపొందిస్తుందనీ ముఖ్యంగా మానసికంగానూ సంతోషంగా ఉంచుతుందనీ చెబుతున్నారు పోషక నిపుణులు. ఎందుకంటే వీటిల్లో విటమిన్లూ ఖనిజాలూ వంటి పోషకాల శాతం చాలా ఎక్కువ. ఓ కప్పు ఉల్లిపాయ ముక్కల నుంచి రెండు గ్రా. ప్రొటీన్, దైనందిన జీవనానికి అవసరమయ్యే విటమిన్-సిలో పది శాతం లభ్యమవుతాయి.
* ఉల్లిపాయల్లోని ఆర్గనో సల్ఫర్ మూలకాల కారణంగా పొట్ట, గొంతు, పేగు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అంతేకాదు, వీటిల్లో ఉండే విటమిన్-సి క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్‌ను సమర్థంగా అడ్డుకుంటుంది. ఇంకా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకునే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తక్కువ అని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశీలనల్లో తేలింది.
* ఉల్లిపాయల్లోని ఫోలేట్లు డిప్రెషన్‌కు కారణమైన హోమోసిస్టీన్ అనే హార్మోన్ శాతాన్ని నియంత్రిస్తాయట.
* ఉల్లిపాయల్లో సమృద్ధిగా ఉండే సి-విటమిన్ చర్మానికీ, జుట్టు పెరుగుదలకీ తోడ్పడుతుంది. ఇందులోని క్రోమియం మధుమేహాన్నీ నియంత్రిస్తుంది.
* ఉల్లిరసంలో తేనె కలిపి తాగితే జ్వరం, జలుబు, అలర్జీలు తగ్గుతాయని తేలింది.
* పచ్చి ఉల్లిపాయను నమలడంవల్ల నోట్లోని బ్యాక్టీరియా పోయి చిగుళ్లూ, దంతాలూ పుచ్చిపోకుండా ఉంటాయి.
* ముక్కులోంచి రక్తం కారుతుంటే చిన్న ఉల్లిముక్కను వాసన చూస్తే రక్తం కారడం ఆగుతుంది.
* పచ్చి ఉల్లిపాయ తింటే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
