టీ సర్కారు తీసుకున్న మరో సంచలన నిర్ణయం..

సమాజంలో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలుగా భావించుకునే వాళ్లు.. ప్రభుత్వ పాఠశాలలంటే విముఖత చూపిస్తారు గానీ.. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన, అర్హులైన ఉపాధ్యాయులు ఉంటారు. అందరూ ప్రెవేటు పాఠశాలలనే ఆశ్రయిస్తుంటారు. కాకపోతే.. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల అర్హతలు, నైపుణ్యతలు ఎప్పుడూ ప్రశ్నార్థకమే. టెన్త్, ఇంటర్ చదివిన వాళ్లు కూడా ప్రెవేటు స్కూళ్లలో టీచర్లుగా పనిచేసేయడం, తమకు తెలిసినంత వరకే విద్యను పిల్లలకు నేర్పడం అనేది రివాజుగా మారిపోయింది. అయితే ప్రెవేటు స్కూళ్లలో కూడా నియమిత నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే బోధన చేసేలా తెలంగాణ సర్కారు ఓ అద్భుత నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రెవేటు పాఠశాలలోనూ పనిచేసే టీచర్లందరూ విధిగా టెట్ పాసయి ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ సమాజంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇప్పటికే బీఈడీ, డీఈడీ అర్హతలున్న వారు మాత్రమే ప్రెవేటు స్కూళ్లలో టీచర్లుగా ఉండాలనే నిబంధన ఉన్నది. దీనివల్ల ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. తాజాగా టెట్ ఉత్తీర్ణులయి ఉండాలనే నిబంధనను కూడా విధించింది. అలాగే.. అర్హత లేని వారు ప్రెవేటు స్కూళ్లలో టీచర్లుగా గనుక ఉంటే.. వారికి ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు.

పట్టణాలు, నగరాల్లో పెద్ద సమస్య కాకపోయినా.. గ్రామాల్లో సరైన అర్హతలు లేనివారంతా టీచర్లుగా చెలామణీ అయిపోతున్నారు. ఇలాంటి పోకడలకు ప్రభుత్వ నిర్ణయంతో చెక్ పడుతుంది. కాకపోతే.. కొన్ని చోట్ల స్కూళ్ల యాజమాన్యాలు రికార్డుల్లో మాత్రం అర్హత ఉన్న వారి పేర్లను రాసుకుని, బినామీలతో టీచింగ్ ను నడిపేసే వ్యవహారాలు చాలా ఉంటున్నాయి. ప్రభుత్వ విద్యాశాఖ ప్రెవేటు స్కూళ్లపై తనిఖీలు క్రమం తప్పకుండా చేస్తూ.. ఇలాంటి అరాచకాలకు కూడా చెక్ పెడితే.. ఇంకా బాగుంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

To Top

Send this to a friend