తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో వారికి పండుగ!


తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు పండుగ చేసుకుంటున్నారు. యాజమాన్యాల చేతుల్లో దోపిడీకి గురవుతున్న ప్రైవేటు టీచర్లకు ప్రభుత్వ నిర్ణయం గొప్ప ఊరటనిస్తోంది..

ప్రైవేటు విద్యాసంస్థలు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఇచ్చే టీచర్ల వేతనాలు చూస్తే చాలా జాలి వేస్తుంది. మన దగ్గర వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలు.. పిల్లలకు పాఠాలు చెప్పే ప్రైవేటు టీచర్లకు మాత్రం కేవలం రూ.5 వేల నుంచి 10 వేల లోపే చెల్లిస్తున్నాయి. మగవారు ఎక్కువ డిమాండ్ చేస్తారని… మహిళలను టీచర్లుగా తెచ్చుకొని వారికి తక్కువ వేతనాలు ఇస్తూ చదువు చెప్పిస్తున్నాయి. రికార్డుల్లో మాత్రం టీచర్లకు 20 వేలపైనే ఇస్తున్నామని ప్రభుత్వ అధికారులకు నివేదికలు ఇస్తున్నాయి. ఈ అక్రమాల తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ప్రైవేటు టీచర్లు ఆర్థికంగా చితికి పోతూనే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఇప్పుడు ప్రైవేటు టీచర్ల దశ మారబోతోంది. వారికి కనీస వేతనాలు అందబోతున్నాయి.

ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజుల వివరాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూలు యాజమన్యం వసూలు చేసిన ఫీజులో 50 శాతాన్ని టీచర్లకు వేతనాలుగా చెల్లించాలని పేర్కొంది. ప్రతి ఏడాది వార్షిక నివేదికలు, ఆడిట్‌ నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని సూచించింది. ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. సీబీఎస్‌ఈ చట్టం ప్రకారం ‘పేరెంట్‌ టీచర్‌ అసోసియేషన్‌’ ఏర్పాటు చేయాలని తెలిపింది. అసోసియేషన్‌లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలని చెప్పింది. తల్లిదండ్రులను సంప్రదించిన తరువాతే ఫీజులను పెంచాలని ఉత్తర్వులో వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల ఇటు ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి వేతనాలతోపాటు.. తల్లిదండ్రులకు ఫీజుల భారం కూడా తగ్గనుంది.

To Top

Send this to a friend