కేసీఆర్, మంత్రులకు ఓటమి భయం..

వచ్చే ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలు చెబుతున్నా… కొందరు మంత్రులకు మాత్రం నమ్మకం కుదరడం లేదట. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే…టీఆర్ఎస్ ఎక్కడ బలంగా ఉందో అక్కడే బరిలో నిలవాలని కొందరు మంత్రులు భావించారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయో లేదో గ్యారెంటీ లేదు. ఢిల్లీలో అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్లను పెంచడం వల్ల బీజేపీకి పెద్దగా లాభం లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దాంతో ఈ అంశాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు సురక్షిత నియోజకవర్గాలను చూసుకుంటున్నారనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. ఇక మంత్రులు కొందరు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం…జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లను గెలుచుకోవడమే. అందుకే పలువురు మంత్రులు …జిల్లాలను వదిలేసి రాజధానిలో పాగా వేసే యోచనలో ఉన్నారు.

హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మంత్రుల జాబితాలో ప్రముఖంగా కేటీఆర్ పేరే వినిపిస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాకుండా జూబ్లీహిల్స్ లేదంటే..ఉప్పల్ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం…రైతన్నలు, నేతన్నలు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటమేనట. చేనేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో అనేక ఆత్మహత్యలు జరిగాయి. నష్ట పరిహారం అందించడంలో గానీ, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోగానీ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే…సీఎం సర్వేల్లో కేటీఆర్ కు 91 శాతం మార్కులు వచ్చినా…. సిరిసిల్లను వదులుకొని జూబ్లీహిల్స్ కానీ ఉప్పల్ కు కానీ రావాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఉప్పల్ లో అయితే వరంగల్ సెటిలర్లు అధికంగా ఉండటంతో పాటు..అక్కడ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. పైగా ఆ నియోజకవర్గ పరిధిలో అందరూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కావడం..మేయర్ బొంతు రామ్మెహన్ కూడా ఉప్పల్ పరిధిలోని చర్లపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఉప్పల్ లో కేటీఆర్ గెలుపు నల్లేరు మీద నడకనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

మరో మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదే రకంగా ఆలోచిస్తున్నారట. తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన వ్యవహార శైలితోనే తాండూరు మున్సిపాలిటీ చేజారిపోయిందనే ప్రచారం ఉంది. అందుకే నియోజకవర్గం మారాలనే నిర్ణయంతోనే తాండూరును ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ నియోజకవర్గంలో మహేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ…హడావిడి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇక మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో ఆయనకు ఎదురు గాలి విస్తోందంటున్నారు. సీఎం సర్వేల్లో సైతం ఆయనకు 30 శాతం మార్కులే వచ్చాయి. సూర్యాపేట లో ఆయన ఓటమి ఖాయమని ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అందాయి. దీంతో నల్గొండ సెటిలర్లు అధికంగా ఉన్న ఎల్బీ నగర్ లేదంటే హుజూరు నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీద పోటీకి దిగాలని యోచిస్తున్నారట.ఉత్తమ్ మీద గెలిస్తే జెయింట్ కిల్లర్ గా పేరొస్తుంది…ఓడితే గట్టి పోటీ ఇచ్చినట్లవుతందని జగదీష్ రెడ్డి భావిస్తున్నారట.
మంత్రులే కాదు… ఏకంగా సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ నుంచి కాకుండా ఈసారి ఆలేర్ నుంచి పోటీ చేస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వివాదం నేపథ్యంలో గజ్వేల్ లో ప్రభుత్వం వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అందుకే రిస్క్ లేకుండా ఆలేర్ నుంచి బరిలో నిలవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.

To Top

Send this to a friend