టీఆర్ఎస్ నాయకులు ఇలా దొరికిపోతున్నారేంటి.?


మొన్న కేకే.. నేడు డీఎస్.. హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో భూములు అక్రమ మార్గాల్లో కొట్టేస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండడం.. కేసీఆర్ తర్వాత సీనియర్లు కే కేశవరావు, డీ శ్రీనివాస్ లు ఉండడంతో ఇప్పుడు వీరి అవసరం అక్రమార్కులకు ఎక్కువైంది. అందుకే కబ్జా చేసిన, అక్రమమైన భూమిలో వీరికి వాటా ఇచ్చి అధికారులు ఇటు వైపు చూడకుండా రియల్ వ్యాపారులు వల పన్నుతున్నారు. తక్కువకు వస్తుందని కొంటున్న కేశవరావు, డీఎస్ లు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

మొన్ననే కేశవరావు ఓ రియల్ వ్యాపారి కబ్జా చేసిన భూముల్లో 50 ఎకరాలను తక్కువ కొని వార్తల్లో నిలిచారు. ఆ వివాదం ఇంకా సద్దుమనగడం లేదు. కేకే చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు చెల్లనివిగా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీనిపై కేకే టీఆర్ఎస్ ప్రభుత్వంపైనే కోర్టులో కేసు వేస్తానని.. తాను కొన్న భూములు సక్రమమేనని తేల్చిచెబుతున్నారు.

ఇక నేడు టీఆర్ఎస్ మరో సీనియర్ నేత డీ శ్రీనివాస్ భూబాగోతం బట్టబయలైంది. మేడ్చల్ గిర్మాపూర్ లో నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమిని డీఎస్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం.. అనుచరుల పేరు మీద మరికొంత రిజిస్ట్రేషన్ చేయడం వివాదాస్పదమైంది. దాదాపు 4 కోట్ల విలువైన ఈ భూమిని డీఎస్ అధికార బలంతో కొట్టేశాడన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలా టీఆర్ఎస్ నేతలు వరుసగా భూ మాయలో పడిపోవడంతో టీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. అక్రమంగా చేసుకున్న భూముల రిజిస్ట్రేషన్లు చెల్లవంటూ తేల్చిచెప్పారు. ఈ భూమాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్వోఆర్ తో పాటు భూ రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు తీసుకొచ్చేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend