మోడీకి ఆప్షన్ లేదు.. అందుకే..

 

అంతా మోడీ గాలిలో బీజేపీ గెలిచేసింది. ఆ పార్టీకి కొన్నిరాష్ట్రాల్లో నాయకులే లేరు.. ఉన్న సీనియర్లందరికీ పదవులు ఇచ్చినా ఇంకా సమర్థ నాయకులు లేరు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్దండులైన తలపండిన రాజకీయ నేతలున్నారు. సుప్రీం న్యాయవాదులు, బిజినెస్ మ్యాన్ లు, వివిధ రంగాల ఆర్థిక నిపుణులు ఉన్న పార్టీ కాంగ్రెస్. బీజేపీ ఏదో గాలివాటంగా మోడీ దయతో గెలిచింది తప్పితే ఆ పార్టీలో అసలు సిసలు నాయకులు లేరనే చెప్పాలి. అందుకే ఉన్న కొద్దివారినే జాగ్రత్తగా మోడీ వాడుకుంటున్నారు.

అప్పట్లో కాంగ్రెస్ నియమించిన గవర్నర్ల పదవీ కాలం పూర్తయ్యాక ఆ పోస్టుల్లో సీనియర్ల బీజేపీ నాయకులను గవర్నర్లుగా పంపుదామంటే బీజేపీ నాయకులే లేని పరిస్థితి. అందుకే కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత విద్యాసాగర్ రావును వెతికి మరీ మహారాష్ట్ర గవర్నర్ గా  పంపాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. ఇప్పటికీ కాంగ్రెస్ నియామకం చేసిన పోస్టుల్లో రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ల పోస్టుల్లో పెడదామంటే మచ్చుకు బీజేపీ నాయకులకు ఎవరూ కనిపించడం లేదు. అందుకే బీజేపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వెంకయ్యను ఆప్షన్ లేక తప్పనిసరి  పరిస్థితుల్లో దేశ రెండో అత్యున్నత పీఠమైన ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ నామినేట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

నిజానికి ఇప్పుడు బీజేపీలో వెంకయ్య కీరోల్ పోషిస్తున్నారు. మోడీకి రైట్ హ్యాండ్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి యూపీ సీఎం ఎన్నికలో.. నిన్న తమిళనాడు అన్నాడీఎంకే సంక్షోభాన్ని చాకచక్యంగా పరిష్కరించడంలో వెంకయ్య సఫలీకృతం అయ్యారు. వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపడానికి అటు మోడీకి ఇష్టం లేదు. ఇటు వెంకయ్యకు ఇష్టం లేదు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్లడం ఇష్టలేదని వెంకయ్య మొత్తుకుంటున్నా.. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఉపరాష్ట్రపతి బరిలో నిలిచారు. ఇలా వెంకయ్య ఇక రాజకీయాలకు దూరంగా రాజ్యాంగ బద్ద పదవిలో కొనసాగనున్నారన్నమాట..

*వెంకయ్య నాయుడు బయోడేటా..
ముప్పవరపు వెంకయ్యనాయుడు.. దేశరాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు.  సుదీర్ఘ రాజకీయ జీవితంలో కాషాయదళంలో వివిధ హోదాల్లో పనిచేశారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేతల్లో ఒకరైన వెంకయ్య.. ఇప్పుడు ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికై.. ఈ అత్యున్నత పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన ప్రొఫైల్‌ ఇది.

వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూలై 1వ తేదీన జన్మించారు. ఆయన తండ్రిపేరు రంగయ్యనాయుడు. తల్లి శ్రీమతి రమణమ్మ. వెంకయ్య నాయుడు ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరు జిల్లాలోనే జరిగింది. నెల్లూరులోని వీఆర్‌ కళాశాల నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో బీఏ పట్టా పొందారు. తర్వాత విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎల్‌ పూర్తి చేసి లా పట్టా అందుకున్నారు. వెంకయ్యకు భార్య ఉషతోపాటు  కొడుకు హర్ష, కూతురు దీప ఉన్నారు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలకు ఆకర్షితులయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌గా పనిచేశారు. ఏబీవీపీలో చేరి నెల్లూరు వీఆర్‌ కాలేజిలోపాటు ఆంధ్రా యూనివర్శిటీలోనూ స్టూడెంట్స్‌ యూనియన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1972 జై ఆంధ్రా ఉద్యమంలో వెంకయ్య క్రియాశీలంగా పనిచేశారు. విజయవాడ, నెల్లూరుల్లో ఉద్యమాలు చేపట్టి తన వాక్‌చాతుర్యంతో వెలుగులోకి వచ్చారు. 1978లో తొలిసారిగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 83 వరకూ బీజేపీ అఖిలభారత యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

1988 నుంచి 93 వరకూ ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య… తర్వాత పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 1998 ఏప్రిల్‌లో కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ తరఫున బరిలో నిలిచారు

To Top

Send this to a friend