తెలుగు పత్రికల స్టామినా


ప్రపంచ దేశాలన్నింటిలో పత్రికల సర్క్కూలేషన్ దారుణంగా పడిపోతోంది. పెద్ద పెద్ద పత్రికలే మూసివేస్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం ట్రైయిన్ రివర్స్ అవుతోంది.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రికల సర్క్యలేషన్ నిర్వహించే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ (ఏబీసీ) సంస్థ తాజాగా 2016 సంవత్సరంలో దేశంలోని పత్రికల సర్క్యూలేషన్ వివరాలను వెల్లడించింది. ఇందులో పత్రికల సర్క్యూలేషన్ పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మీడియా, వెబ్ సైట్ల మాయలో పడి పత్రికలు కొనేవారు కరువవుతున్న నేపథ్యంలో ఇండియాలో మాత్రం పత్రికలు ఎక్కువగా అమ్ముడుపోవడంపై ఏబీసీ హర్షం వ్యక్తం చేస్తోంది.

దేశవ్యాప్తంగా అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికగా హిందీలో ప్రచురితమయ్యే దైనిక్ భాస్కర్ దాదాపు 38 లక్షల సర్క్యులేషన్ తో మొదటి స్థానంలో నిలిచింది. హిందీలోనే దైనిక్ భాస్కర్ తో పోటాపోటీగా దైనిక్ జాగరణ్ కూడా దాదాపు 36 లక్షల కాపీలతో రెండో స్థానంలో పోటీపడుతోంది. ఇక తెలుగు పత్రిక ఈనాడు 18 లక్షల సర్య్కూలేషన్ తో 7వ స్థానంలో నిలిచింది. సాక్షి 11 లక్షల కాపీలతో 15వ స్థానంలో నిలిచింది. మరే ఇతర తెలుగు పత్రిక దేశంలో టాప్ 20లో లేకపోవడం గమనార్హం..

ఇక తెలుగులో మూడోస్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక 6లక్షల సర్క్యూలేషన్ తో ఉంది. కానీ పాఠకుల రీడర్ షిప్ పరంగా సాక్షిని దాటేసి రెండో స్థానంలో ఉంది. అంటే ఎక్కువ మంది చదివే విషయంలో ఆంధ్రజ్యోతి ముందున్నదన్న మాట.. ఇక కొన్నేళ్ల క్రితం ఏర్పడ్డ టీఆర్ఎస్ అనుబంధ నమస్తే తెలంగాణ పత్రిక ఇంకా ఏబీసీ ఆడిట్ లోకి రాలేదు.

ప్రస్తుతం ఎలక్ర్టానిక్ మీడియా, వెబ్ సైట్లు హోరెత్తుతున్నాయి. క్షణాల్లో వార్త సోషల్ మీడియాలో వెబ్ సైట్లలో వచ్చేస్తోంది. ఇంతటి వేగవంతమైన యుగంలో కూడా నిన్నటి ముఖ్య వార్తలను విపులంగా వివరించే పత్రికలకు ఆదరణ పెరుగుతుండడం ఇండియాలో శుభపరిణామని సీనియర్ పాత్రికేయులు వ్యాఖ్యానిస్తున్నారు.

To Top

Send this to a friend