నా తెలుగుకు ఎంత ఖర్మ పట్టింది..?

 

తేట తెలుగు.. తేనె లొలుకు.. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు తమ మాతృభాషపై మమకారంతో ఎన్నో భాష సేవ కార్యక్రమాలను చేస్తున్నారు. వారి రాష్ట్రాల్లో భాషను తప్పనిసరి చేసి అంతరించిపోకుండా కాపాడుతున్నారు. కానీ ఇక్కడి తెలుగు ప్రభుత్వాలు మాత్రం ఇంకా పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను చంపేస్తున్నాయి.

తమిళ, మాలయాళంలో జాతీయ చానాళ్లు అయిన డిస్కవరీ, నేషనల్ జియోగ్రఫీ లాంటి చానళ్లు తమ వ్యూయర్ షిప్ పెంచుకోవడానికి తమిళం, మలయాళంలో ప్రసారాలు చేస్తున్నాయి. తెలుగులో కూడా చేస్తున్నాయనుకోండి.. కానీ అక్కడ భాషాభిమానంతో పోల్చితే తెలుగులో తక్కువ.. అందుకే ఇక్కడ తెలుగు అంతరిస్తుండగా.. పక్కభాషలైన తమిళం, మలయాళం ఇంకా వర్ధిల్లుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా కేజీటీ పీజీ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియా చదువులను ప్రోత్సహిస్తూ తెలుగును అంతరించిపోయే భాష జాబితాలోకి తీసుకొస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూడా ఇంగ్లీష్ చదువులకే ప్రాధాన్యమిస్తున్నారు. తమ కొడుకులు, కూతుళ్లు ఇంగ్లీష్ చదువులు చదివి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇంజినీర్లు కావాలని తల్లిదండ్రులు కూడా తెలుగుకు మంగళం పాడి ఇంగ్లీష్ ను నెత్తిన పెట్టుకుంటున్నాయి. తమ పిల్లలకు కనీసం మాట్లాడేందుకు వీలుగా తెలుగును కనీసం నేర్పించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.. ఇటీవల జరిగిన ఓ సంఘటన తెలుగులో పిల్లలు ఎంత పూర్ గా ఉన్నారో చెప్పకనే చెబుతోంది.. ఆ సంఘటనను కింద చూడండి..

‘‘ మొన్నామధ్య సాయంత్రం వేళ సరిగ్గా ఒక స్కూల్ గేటు ముందే బైక్ పంచర్ అయ్యింది. పరీక్షించి చూడగా మేకు దిగబడి ఉంది ఎలాగూ ట్యూబ్ పనికిరాదని గుర్తించి ట్యూబ్ తోసహా రమ్మని మెకానిక్ కి ఫోన్ చేసి అక్కడే నిల్చున్నాను ….ఆ స్కూల్ వాచ్మెన్ ఒకప్పుడు మా ఫ్రెండ్ దగ్గర పనిచేసాట్ట . నన్ను చూసి గుర్తుపట్టి కూర్చోమన్నాడు.

అప్పటికే స్కూల్ వదిలేసారు లోపల కొద్ది మంది పిల్లలు ఉన్నారు పేరెంట్స్ కోసం వేచి చూస్తూ..!

పక్కనే ఒంటరిగా బెంచ్ మీద కూర్చున్న నాలుగేళ్ల బుడ్డోడు నన్ను ఆకర్షించాడు ….. వెళ్లి పక్కన కూర్చుని ” ఏమ్మా ఇంకా అమ్మ రాలేదా తీసుకెళ్ళడానికి “? అని అడిగాను …

” అమ్మలేదు ” అన్నాడు అదోలా… నాకు మనసు చివుక్కుమంది..

” ఓహ్ నాన్న వస్తారా అయితే నిన్ను తీసుకెళ్ళడానికి ” అనడిగా..
” నాన్న లేడు” అన్నాడు అదే భావంతో …

నా మనసనే కడలి కల్లోలమై కన్నీరు కెరటాల్లా రాబోతుండగా ..” మరి ఎవరు తీస్కేల్తారు “అని అడిగా …..

బేలగా చూస్తూ ” మమ్మీ గానీ డాడీ గానీ వస్తారు” అన్నాడు వాడు టక్కున.

తూ.. దీనెమ్మ జీవితం.. నా తెలుగు కు ఇంత దరిద్రం పెట్టిందా అనుకున్నా… మీ పిల్లలకు కనీసం తెలుగులో మమ్మీకి అమ్మ అని.. నాన్నను డాడీ అంటారని నేర్పించకపోవడంపై విస్మయానికి గురిచేసింది… ’’

To Top

Send this to a friend