కాంగ్రెస్ తో టీడీపీ:అన్నగారి ఆశయం బూడిదలో..

స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు తెలుగుదేశం స్థాపించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా.. స్థాపించిన 9 నెలల్లోనే ప్రభంజనంలో ఏపీలో అధికారంలోకి వచ్చారు. కుహానా కాంగ్రెస్ నేతల పాలనను అంతమొందించి తెలుగు ప్రజలకు సుపరిపాలనను అందించారు. అంతటి టీడీపీ ప్రస్తుతం తెలంగాణలో కునారిల్లుతోంది. పార్టీని కాపాడేందుకు అవసరమైతే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. వచ్చే 5 ఏళ్లు ఆ పార్టీదే అధికారం రీతిలో పరిస్థితి ఉంది. బీజేపీ కొద్దొ గొప్పో తెలంగాణలో అధికారం కోసం ఒంటిరిగా బరిలోకి దిగి ప్రయత్నిస్తోంది. తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని అమిత్ షా ప్రకటించారు. దీంతో ఇప్పటికే సగం చచ్చిన తెలంగాణ తెలుగు దేశం కాంగ్రెస్ వైపు చూస్తోంది. టీడీపీ పార్టీని బతికించడానికి కేసీఆర్ పై పగ సాధించడానికి టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తో కలుస్తామని ప్రతిపాదించడంపై టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది.

తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా వెళ్లాలని.. కాంగ్రెస్ ను విభేదించిన టీడీపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు క్షమించరని బాబు .. రేవంత్ రెడ్డికి క్లాస్ పీకినట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకొని వెళ్లాలని సూచించినట్టు తెలిసింది.

అయితే పొత్తు లేకుంటే వచ్చే 2019 ఎన్నికల్లో టీడీపీ అంతర్థానమైపోతుందని.. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ తో వెళితే కేసీఆర్ ను ఎదుర్కోవచ్చని రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది. దీంతో టీడీపీ స్థాపించిన అన్నగారి ఆశయాన్ని రేవంత్ రెడ్డి బూడిదలో పోస్తున్నారని టీడీపీ అభిమానులు కుమిలిపోతున్నారట..

To Top

Send this to a friend