తెలిసిన ముఖం కాదుగా..!

ప్రత్యర్థి మామూలోడు కాదు.. తెలంగాణ ఉద్యమ సేనాని.. ఉద్యమం చల్లారినప్పుడల్లా వేడి రగిలించి దాదాపు 13 ఏళ్లు కొట్లాడి తెలంగాణ సాధించిండు.. తెలంగాణ వచ్చాక అన్ని పార్టీలను కాకవికలం చేసి టీఆర్ఎస్ ను రాష్ట్రంలో బలీయమైన శక్తిగా మార్చాడు. బలమైన ఆంధ్రా లాబీయింగ్ ను,  ఓటుకు నోటు కేసులో చంద్రబాబును సైతం నియంత్రణలో పెట్టిన మొనగాడు కేసీఆర్.. రాష్ట్రం ఏర్పడ్డాక విభిన్న వ్యూహాలు రూపొందిస్తూ తనకు ఎదురులేకుండా కేసీఆర్ చేసుకున్నారు.  ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ను మించిన రాజకీయ నాయకుడు, వ్యూహకర్త లేడు.

 

* తెలిసిన ముఖం కాదుగా..
అలాంటి తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనుకుంటోంది. అందుకోసం ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు తెలంగాణకు వచ్చాడు. నల్గొండ జిల్లాలో పర్యటించారు. సామాన్యులతో మమేకమయ్యాడు. టీలు తాగాడు, భోజనం చేశాడు. కానీ ఆ సామాన్య ప్రజలకు ఈయన బీజేపీ అధ్యక్షుడని.. పెద్ద నేత అని వారికి తెలియదు. ఎందుకంటే మోడీ దయతో బీజేపీ అధ్యక్షుడైన అమిత్   దక్షిణాదిలో సాధారణ జనానికి అంతగా తెలిసిన ముఖం కాదు.  ఆయన్ను చూసిన దాఖలాలు లేవు. అందుకే ఆయన పర్యటనకు ఆదరణ కరువైంది. దీంతో ఆయన పర్యటన సాగినా జనంలోకి వెళ్లలేదు.

* మొక్కుబడి తంతు
అమిత్ షా తెలంగాణ పర్యటనను బీజేపీ నేతలు లైట్ తీసుకున్నారు. ఆయన వెంట ఉన్న కిషన్ రెడ్డి అంటీముట్టనట్టుగా ఉన్నట్టు బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ నేతలందరికీ కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. వారితో లోపాయికారి ఒప్పందాలున్నాయి. అందుకే అమిత్ షా వచ్చి పార్టీ బలోపేతంపై, కేసీఆర్ ముస్లిం రిజర్వేషన్లు,  ప్రగతి భవన్, తిరుమలకు ప్రభుత్వ ఖర్చుతో నగలు , డబుల్ బెడ్ రూం ఇళ్లు, తదితర ఫెయిల్యూర్ పనులను ఎందుకు ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నించినప్పుడు వారు మౌనంగా ఉండడంపై అమిత్ షా ఫైర్ అయినట్టు సమాచారం.

*బలం , బలగం లేకుండానా..
బీజేపీ యూపీలో గెలిచిందంటే అక్కడ ప్రత్యర్థులు బలహీనంగా ఉండడమే కారణం.. భ్రష్టుపట్టిన సమాజ్ వాదీ పార్టీని వదిలించుకునేందుకే బీజేపీని గెలిపించారు. కానీ తెలంగాణలో అలా లేదు. దేశంలో ఎవ్వరూ ఊహించని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ కేసీఆర్ రోల్ మోడల్ గా తయారవుతున్నారు. కేసీఆర్ పథకాలు, పాలనను ప్రధాని మోడీ సైతం వేయినోళ్ల పొగిడేశాడు. అంతా ప్రభావశీల పాలన, పథకాలను తోసిరాజని అమిత్ షా తెలంగాణలో కునారిల్లుతున్న బీజేపీని గద్దెనెక్కించాలని చూడడం నిజంగా అత్యాశే.. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి సరైన నాయకులు లేరు.. కార్యకర్తలూ లేరు. కొత్తగా వచ్చే వారు కరువే.. దీంతో తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇదో పెద్ద సవాల్.. హైదరాబాద్ లో బలంగా ఉన్న ఆంధ్రుల మనసు గెలుచుకొని మరీ  జీహెచ్ఎంసీ పీఠం గెలిచిన కేసీఆర్ వ్యూహాల ముందు అమిత్ షా అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసినా దిగదుడుపే అన్నది విశ్లేషకుల భావన..  ఇవన్నీ పరిశీలిస్తే కేసీఆర్ ముందు అమిత్ ఆశలు గల్లంతేననడంలో ఎలాంటి సందేహం లేదు.

To Top

Send this to a friend