ఐవైఆర్ తొలగింపు వెనుక పెద్దలు …


ఏపీలో అవినీతి మరీ ఎక్కువైపోయింది.. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు, కేంద్రంలోని సర్వే సంస్థలు తేటతెల్లం చేశాయి. అయినా టీడీపీ ప్రజాప్రతినిధుల ధనదాహం ఆగడం లేదు. భూములు కనపడితే చాలు దక్కించుకోవాలనే పట్టుదల పోవడం లేదు. దీనికి అధికారంలో ఉన్న పెద్ద మనిషి కొడుకు అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే అవినీతి ఏపీలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. వీటికి సహకరించిన ఐవైఆర్ కృష్ణారావు వంటి ఐఏఎస్ లు బలైపోతున్నారు..

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు వెనుక అందరూ అనుకుంటున్నట్టు ఫేస్ బుక్ పోస్టింగులు కారణం కాదని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఐవైఆర్ నిర్ణయాల వల్ల విజయవాడ నడిబొడ్డున ఉన్న 300 కోట్ల శాతవాహన ఆస్తులు టీడీపీ నేతలకు దక్కలేదు. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేతలు కాలేజీ కమీటీలో చేరాలని ప్రయత్నించారు. కానీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆస్తుల్లోకి టీడీపీ నేతలను డైరెక్టర్లుగా నియమించేందుకు ఐవైఆర్ ఒప్పుకోలేదు. అడుగుపెట్టనీయ లేదు. దీంతో 300 కోట్ల ఆస్తికోసం ఐవైఆర్ కు ఎసరు పెట్టారు..

ప్రభుత్వంలోని చినబాబు అండదండలతో స్కెచ్ వేసిన టీడీపీ నేతలు మెల్లగా ఎప్పుడో ఐవైఆర్ పోస్టు చేసిన సోషల్ మీడియా క్లిప్పింగ్ లను తెరపైకి తెచ్చి వివాదాస్పదం చేశారని ఇన్ సైడ్ టాక్. ఆయన అడుగడుగునా టీడీపీకి నష్టం చేకూరుస్తూ వైసీపీ పాట పాడుతున్నారని బాబును నమ్మించారు. దీంతో చంద్రబాబు ఐవైఆర్ ను బ్రాహ్మణ కార్పొరేషన్ పదవి నుంచి తొలగించారు. ఇలా ఓ 300 కోట్ల స్థలం కోసం టీడీపీ నేతలు వేసిన ప్లాన్ ను అమలు చేయని ఐవైఆర్ చివరకు పదవి కోల్పోయారు. అవినీతికి అడ్డు వచ్చిన అధికారులను టీడీపీ నేతలు ఎలా తొలగించుకుంటారోనన్న దానికి ఈ ఉదంతం పెద్ద ఉదాహరణగా నిలిచిపోయింది.

To Top

Send this to a friend