ఎన్టీఆర్‌ జీవితంపై 3 భిన్న చిత్రాలు!


తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానంను దక్కించుకుని, తెలుగు వారి హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న అన్నగారు ఎన్టీఆర్‌ ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగు వారి ఆత్మగౌరవంను జాతీయ స్థాయిలో నిలిపిన ఎన్టీఆర్‌ జీవితంలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. వాటిని సినిమా తీయాలనే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదట బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రతో సినిమాను తీస్తాను అంటూ ప్రకటించాడు. దర్శకుడు నిర్మాత త్వరలోనే అనౌన్స్‌ చేస్తాను అన్నాడు.

బాలకృష్ణ సినిమా ప్రకటించిన ఇన్నాళ్లకు వర్మ కూడా తాను ఎన్టీఆర్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించాడు. అయితే మొదట బాలయ్య, వర్మ చేయబోతున్న సినిమా ఒక్కటే అని అంతా భావించారు. అయితే వర్మ తాను తీయబోతున్న ఎన్టీఆర్‌ సినిమా పూర్తి వివాదాస్పదంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. బాలయ్య వివాదాలతో తన తండ్రి సినిమాను చేస్తాడని భావించలేం. అందుకే ఎన్టీఆర్‌ కథతో రెండు వేరు వేరు చిత్రాలు తెరకెక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు.

బాలకృష్ణ, వర్మలు ఎవరు చేసినా కూడా ఎన్టీఆర్‌ జీవితంలో జరిగిన అసలు విషయాలు చూపించాలని, ఆయన చివరి క్షణాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులను, వెన్ను పోటును చూపించాలని ఆయన భార్య లక్ష్మి పార్వతి డిమాండ్‌ చేస్తున్నారు. వారు చేయబోతున్న సినిమాల్లో చంద్రబాబును విలన్‌గా కాకుండా హీరోగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకోను అంటూ చెప్పుకొచ్చింది. తాను స్వయంగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమాను నిర్మించాలని, అందులో చంద్రబాబు బతుకును బజారుకు ఈడ్చాలని లక్ష్మి పార్వతి భావిస్తుంది. అందుకు వైకాపా వారు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్‌పై మూడు సినిమాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

To Top

Send this to a friend