పడిపోయే పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం..

ఓటుకు నోటు స్కాం తమిళనాడులో కూడా దుమారం రేపుతోంది. ఫిబ్రవరిలో అన్నాడీఎంకే ప్రభుత్వం నిలబడడం కోసం సీఎం ఫళని స్వామి బలపరీక్ష సందర్భంగా ఒక్కో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రూ.2 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ముట్టజెప్పినట్టు జాతీయ చానళ్లు నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో ఓ ఎమ్మెల్యే వెల్లడించిన సంగతి తెలిసిందే.. ఇది ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్ ఆందోళన తీవ్రతరం చేశారు. అధికార అన్నాడీఎంకే పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు.

డీఎంకే అధినేత స్టాలిన్ ఇంటా బయట రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే ఓటుకు నోటు, ఫళని స్వామి అనైతిక కార్యక్రమాలపై విస్తృతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. విశ్వాసపరీక్షలో డబ్బు వెదజల్లి నెగ్గారని.. ఈ ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేయనున్నట్టు స్టాలిన్ ప్రకటించడంతో అధికార అన్నాడీఎంకే పార్టీ, సీఎం ఫళని స్వామి చిక్కుల్లో పడ్డారు. ఒకవేళ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే ఫళని ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా ఈ విషయాన్ని వదలకుండా డీఎంకే నేత స్టాలిన్ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. విశ్వాసపరీక్షలో అనైతికాలకు పాల్పడ్డ ఫళని ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ ను కోరతామని స్టాలిన్ ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన నెలకొంది.

To Top

Send this to a friend