పేదలందరికీ బతుకమ్మ చీరలు.. వెనుక గొప్ప కారణం..

బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి రేషన్ షాపుల ద్వారా సెప్టెంబర్ 18,19,20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్లు తెలిపారు. పవర్ లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పేద మహిళలందరికీ చీరలందించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఎం పిలుపునిచ్చారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా కలెక్టర్లను కేసీఆర్ కోరారు. బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పంపిణీ చేసే చీరల నాణ్యతను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడారు.

 

‘‘తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగను జరుపుకుంటారు. ఇది రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండుగ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతింటికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవానే ఉద్దేశ్యంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశాం. కానీ బతుకమ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం’’ అని సిఎం ప్రకటించారు.

 

సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి మారిపోతుంది.. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారి ద్వారానే కొనుగోలు చేస్తున్నది. దీని ద్వారా కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది.  ఈ చర్యల వల్ల నేత కార్మికులు దుర్భర పరిస్థితి నుంచి బయటపడతారు

 

రాష్ట్రంలో కోటి 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయారు చేయడానికి ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. అవి తయారవుతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్ రెండో వారంలో జిల్లా కేంద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి రేషన్ షాపులకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల్లో సెప్టెంబర్ 18,19,20 తేదీల్లో మహిళలకు పంపిణీ చేస్తారు. సదరు మహిళ షాపుకు రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లిగానీ, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. రేషన్ షాపుల్లో ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు లేఖ రాయాలని మంత్రి కేటీఆర్ ను సిఎం ఆదేశించారు.  ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం కోరింది.

To Top

Send this to a friend