పవన్‌ చిత్రంలో స్టార్‌ హీరో ..!


పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తర్వాత తెరకెక్కుతున్న చిత్రంపై మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పవన్‌ స్థాయి మరింతగా పెంచేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం సారధి స్టూడియోస్‌లో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్టింగ్‌లో యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.

సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్‌ ఇస్తూ ఈ చిత్రంలో మరో హీరో వెంకటేష్‌ను చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌లు కలిసి ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా నడిచింది. ఆ సినిమా సమయంలోనే పవన్‌, వెంకీల మద్య సన్నిహిత సంబంధం మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత కూడా ఇద్దరి మద్య స్నేహం కొనసాగుతుంది.

ఆ స్నేహంతోనే ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించాల్సిందిగా పవన్‌ కోరడం అందుకు వెంటనే వెంకీ ఓకే చెప్పడం వెంట వెంటనే జరిగిపోయినట్లుగా తెలుస్తోంది. గతంలో వెంకీ నటించి సూపర్‌ హిట్‌ అయిన పలు సినిమాలకు త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ మరియు మాటలు అందించాడు. ఆ అభిమానంతో కూడా వెంకీ ఈ సినిమాకు ఓకే చెప్పి ఉంటాడు అని తెలుస్తోంది. ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ కాని ఈ సినిమాలో వెంకీ దాదాపు 5 నుండి 7 నిమిషాలు కనిపిస్తాడని తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

To Top

Send this to a friend