‘బాహుబలి’ సినిమా కోసం అయిదు సంవత్సరాల పాటు కఠోర శ్రమ పడ్డ రాజమౌళి రెండు పార్ట్లు కూడా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. విదేశాలకు రాజమౌళి వెళ్తాడని అనుకున్నారు. కాని విదేశాలకు వెళ్లకుండా హైదరాబాద్‌లోనే గడుపుతున్నాడు. రాజమౌళి తన తర్వాత సినిమాను ఎవరితో చేస్తాడు అనేది ప్రస్తుతం అందరి మెదడును తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడెప్పుడు లభిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలోనే రాజమౌళి తన తర్వాత సినిమాను ఎన్టీఆర్, మహేష్బాబుల్లో ఒకరితో చేసే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభాస్‌తో కూడా రాజమౌళి తర్వాత సినిమా చేసే అవకాశం ఉందని, జక్కన్న మనస్సులో ప్రభాస్ ఉన్నాడని అంటున్నారు. తనపై నమ్మకం పెట్టి ‘బాహుబలి’ సినిమా కోసం నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ ప్రభాస్‌తో మరో సినిమాను చేయాలని ఉందని జక్కన్న అనుకుంటున్నాడట. అయితే ఇది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా మాత్రం కనిపించడం లేదు.
‘బాహుబలి’ పూర్తి చేసిన వెంటనే ‘సాహో’ సినిమాను ప్రభాస్ మొదలు పెట్టాడు. మరి కొన్ని రోజుల్లోనే ‘సాహో’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం చివర్లో ‘సాహో’ చిత్రీకరణ పూర్తి కానుంది. ఆ వెంటనే ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక స్టైలిష్ మూవీని ప్రభాస్ చేయబోతున్నాడు. అది వచ్చే సంవత్సరం ద్వితీయార్థం వరకు పట్టే అవకాశాలున్నాయి. అంటే ఇంకా సంవత్సరం పాటు ప్రభాస్‌కు ఖాళీ లేదు. రాజమౌళి సంవత్సరం వరకు ఎదురు చూస్తాడని అనుకోలేం. అందుకే ప్రభాస్‌తో రాజమౌళి సినిమా ఇప్పట్లో ఉండదని, రాజమౌళి తన తర్వాత సినిమాను ప్రభాస్‌తో కాకుండా మరో హీరోతో చేసే అవకాశాలున్నాయి. ఆ హీరో ఎవరు అనేది ఆయన నోటి నుండే త్వరగా రావాలని కోరుకుందాం.
