శృతి తప్పిన ఆ సినిమాలో నయన!


‘బాహుబలి’ చిత్రం తర్వాత భారీ బడ్జెట్‌ చిత్రాల సంఖ్య పెరగబోతుంది. ముఖ్యంగా సౌత్‌లో మునుపెన్నడు లేని విధంగా భారీ బడ్జెట్‌తో చిత్రాలను తెరకెక్కించేందుకు మేకర్స్‌ ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘సంఘమిత్ర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం ‘బాహుబలి’ స్థాయిలో ఉంటుందని, బాలీవుడ్‌లో సైతం ఈ చిత్రం దుమ్ము రేపడం ఖాయం అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ గొప్పలు చెబుతున్నారు. ఈ చిత్రం కోసం దాదాపు ఆరు నెలలుగా కసరత్తులు జరుగుతున్నాయి.

చిత్రం కోసం ప్రత్యేకంగా విదేశాల్లో శిక్షణ తీసుకున్న హీరోయిన్‌ శృతిహాసన్‌ కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. దాంతో చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమాకు ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా హీరోయిన్‌ తప్పుకోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. శృతి తప్పుకోవడంతో ఆమె స్థానంను స్టార్‌ హీరోయిన్‌ నయనతారను ఎంపిక చేయడం జరిగింది.

నయనతార ప్రస్తుతం సౌత్‌లో స్టార్‌ హీరోయిన్‌. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాలకు, భారీ చిత్రాలకు పెట్టింది పేరు. అటువంటిది ఈ అమ్మడు ‘సంఘమిత్ర’ చిత్రంలో చేయడం వల్ల సినిమా స్థాయి పెరుగుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. శృతిహాసన్‌ కంటే దాదాపు కోటిన్నర అదనంగా ఈ అమ్మడికి పారితోషికం ఇస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించాలని భావిస్తున్నారు. శృతి తప్పిన సంఘమిత్రకు నయన్‌ న్యాయం చేస్తుందా అనేది చూడాలి.

To Top

Send this to a friend