సొంతరాష్ట్రంలో ఎందుకీ అవమానం


కేసీఆర్ డౌన్ డౌన్: విద్యార్థుల అసంతృప్తికి కారణమేంటి.?
స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ మెచ్చుకున్నారు.. తెలంగాణ పథకాలు.. కేసీఆర్ పాలన భేష్ అంటూ దేశం కీర్తిస్తోంది. తెలంగాణలోనూ ఎదరులేకుండా టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. అయినా కేసీఆర్ కు అవమానాలు ఎదురయ్యాయి. అదీ సొంత రాష్ట్రంలోనే.. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డలోనే.. తెలంగాణకు కారకులైన ఆ ఉస్మానియా విద్యార్థులే.. తెలంగాణ ఉద్యమకారుడిని అవమానించారు. విద్యార్థుల్లో ఎందుకీ అసంతృప్తి.. అన్నీ చేసిన కేసీఆర్ విద్యార్థులకు ఏం అన్యాయం చేశారు.? ఈ చిక్కు ప్రశ్న అందరిని తొలుస్తోంది..

ఎందరో ఉద్యమకారులకు, మేధావులకు, భావి భారత పౌరులను అందించిన ఉస్మానియా నేలలో కేసీఆర్ కనీసం అరగంట కూడా ఉండలేకపోయారు. వందేళ్ల ఉస్మానియా వార్సికోత్సవం ఘనంగా ప్రారంభమైంది… పత్రికలన్నీ పతాక శీర్సికల్లో ఉస్మానియా ఘనతను చాటాయి. స్వయంగా ఉస్మానియా విద్యార్థి, ఉద్యమకారుడు అయిన సీఎం కేసీఆర్ సహా దేశ రాష్ట్రపతియే ఈ స్నాతకోత్సవానికి తరలివచ్చారు. కానీ ఉస్మానియా విద్యార్థులు నిరసించారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. చెప్పులు చూయించారు. ఈ అవమానానికి కనీసం మాట్లాడలేకపోయిన కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగం పూర్తికాగానే పలాయనం చిత్తగించారు.

తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశాన్ని తన పాలనతో ఆకట్టుకుంటున్న కేసీఆర్ విద్యార్థుల విషయంలో మాత్రం ఎందుకు విలన్ అయ్యారనే ప్రశ్న అందరిని తొలుస్తోంది. కేసీఆర్ రైతులకు , ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కానీ తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని ఆశపడి ఉద్యమించిన విద్యార్థులకు మాత్రం ఏం చేయలేకపోయారు. వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా అవి కోర్టుల్లో స్టేలు వచ్చిపడ్డాయి. మరికొన్ని అసంబద్ధ నిబంధనలతో వాయిదాలు పడ్డాయి. దీంతో తెలంగాణ వచ్చి మూడేళ్లు అయినా కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగుల్లో కేసీఆర్ పాలనపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఉద్యోగాలు ప్రభుత్వం ఇలా ప్రకటించడం ఆలస్యం కోర్టుల్లో స్టేలు రావడం.. లేదా రద్దు కావడాన్ని చూసి కేసీఆర్ పై అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు విద్యార్థులు.. ఆ ప్రతీకారేచ్చను ఉస్మానియాలో చూపించారు. ఉద్యమించిన తమ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్ ను ఇలా సమయం చూసి ఉస్మానియాలో అవమానించారు. కేసీఆర్ ను మారు మాట్లాడనీయకుండా చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.

To Top

Send this to a friend