‘సంఘమిత్ర’ నుండి శృతిహాసన్‌ ఔట్‌

తమిళ బాహుబలిగా పేరు తెచ్చుకుంటున్న ‘సంఘమిత్ర’ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లబోతుంది. ఇంకా ప్రారంభం కాకుండానే తమిళ సినీ అభిమానుల ఆధరణ మాత్రమే కాకుండా సౌత్‌ ప్రేక్షకుల అందరి దృష్టిని ఈ సినిమా ఆకర్షిస్తుంది. సుందర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 200 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంలో జయం రవి, ఆర్యలు హీరోలుగా నటించనుండగా ముద్దుగుమ్మ శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించనుందని అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ ముగ్గురు కూడా ‘సంఘమిత్ర’ చిత్రం కోసం విదేశాల్లో నెల రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. ఇటీవలే ముఖ్య పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను కూడా యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని భావిస్తున్న తరుణంలో చిత్ర యూనిట్‌ సభ్యులకు షాక్‌ ఇస్తూ సంఘమిత్ర చిత్రం నుండి శృతిహాసన్‌ తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్‌ు కమిట్‌ అయ్యి ఉండటంతో పాటు, సంఘమిత్ర చిత్రానికి ఎక్కువ రోజులు డేట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో శృతిహాసన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా శృతిహాసన్‌ సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించింది. త్వరలోనే మరో హీరోయిన్‌ను ఎంపిక చేస్తామని వెళ్లడి చేసింది. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిత్ర దర్శకుడు సుందర్‌ ఒక పక్కా ప్రణాళికతో సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లకుండా, స్క్రిప్ట్‌ను పూర్తి చేయకుండానే సినిమాను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాడు. అలా చేయడం వల్ల ఖచ్చితంగా అనుకున్న సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశ్యంతో శృతి ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

To Top

Send this to a friend