సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పైడర్’. ఈ సినిమాను ముందు అనుకున్న ప్రకారం జూన్ అంటే వచ్చే నెలలో విడుదల చేయాలని భావించారు. కాని అనుకున్న సమయంకు షూటింగ్ పూర్తి చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. హీరో ఆశించినట్లుగా సహకరించక పోవడం వల్ల కూడా సినిమా ఆలస్యం అయ్యిందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తామని ఆ మద్య నిర్మాతలు ప్రకటించారు.
వరుస వాయిదాల తర్వాత ఇటీవలే ‘స్పైడర్’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఇక కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31న సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్పైడర్ టీజర్ విడుదల ఇప్పట్లో ఉండే అవకాశం లేదని, కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా స్పైడర్ చిత్రానికి చెందిన మరికొన్ని మహేష్‌బాబు స్టిల్స్‌ను విడుదల చేస్తామని, అంతే తప్ప టీజర్‌ను ఇప్పట్లో విడుదల చేసే ఆలోచన మురుగదాస్‌కు లేదని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
భారీ అంచనాల నడుమ దాదాపు 110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగుతో పాటు భారీగా హిందీ మరియు తమిళంలో కూడా విడుదల చేసి భారీ బిజినెస్‌ను చేయాలనే ఉద్దేశ్యంతో మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.
