ఎస్‌ బీ ఐ లో 6000 మందికి పైగా ఉద్యోగులు ఔట్‌

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) భారీగా తన ఉద్యోగులను తగ్గించుకుంది. స్వచ్చంద పదవీ విరమణ పథకం, పదవీ విరమణలతో ఆరు వేలకు మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఈ క్వార్టర్‌ ప్రారంభంలో 2.80 లక్షలుగా ఉన్న ఎస్‌బీఐ ఉద్యోగులు, క్వార్టర్‌ ముగిసే నాటికి 2.73 లక్షలకు చేరుకున్నారు. ఈ తగ్గింపు మరింత ఉండనుందని తెలుస్తోంది. పదవీ విరమణలతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో సుమారు 15,460 మంది ఉద్యోగులు తగ్గిపోనున్నారని అంచనాలు వెలువడుతున్నాయి. అంతేకాక డిజిటలైజేషన్‌తో పాటు తన అసోసియేట్‌ బ్యాంకులు తనలో విలీనమైన నేపథ్యంలో 10వేలకు మందికి పైగా ఉ‍ద్యోగులను కొత్త ప్రాంతానికి లేదా కొత్త పనివిభాగాలకు కేటాయించేందుకు ఎస్‌బీఐ ప్రణాళికలు రచిస్తోంది. అసోసియేట్‌ బ్యాంకుల కన్సాలిటేషన్‌, డిజిటల్‌ చానళ్లలోకి మారే క్రమంలో దేశంలోనే ఎక్కువమంది ఉద్యోగులను కలిగి ఉన్న ఈ బ్యాంకింగ్‌ దిగ్గజం ఉద్యోగ పునర్నిర్మాణ ప్రక్రియను చేపట్టింది.

ఎక్కువమొత్తంలో పునర్నిర్మాణం విలీనంతోనే చోటుచేసుకుంటున్నట్టు తెలిసింది. ఒకే స్ట్రీట్‌లో ఎక్కువమొత్తంలో అవుట్‌లెట్లను నిర్మూలించేందుకు బ్యాంకు చూస్తోంది. ఆగస్టు 6 నాటికి 594 బ్రాంచులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. 122 అధికారిక కార్యాలయాలను హేతుబద్ధం చేసింది. దీంతో వార్షికంగా 1,160 కోట్ల రూపాయలను ఎస్‌బీఐకి ఆదా చేసుకోనుంది. ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లాంటి ప్రైవేట్‌ రంగ బ్యాంకులు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. డిజిటల్‌ లావాదేవీలను పెంచుతూ తమ ఉద్యోగులకు కోత పెడుతున్నాయి. 2016 డిసెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 90,421 మంది ఉ‍ద్యోగులుంటే, 2017 మార్చి నాటికి 84,325 మంది ఉద్యోగులున్నారు.

To Top

Send this to a friend