రేవంత్ కు నో ఎంట్రీ

కల్వ‌కుంట్ల రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారింది తెలంగాణ అసెంబ్లీ. ఆదివారం జ‌ర‌గ‌నున్న ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌కు టిడిపి స‌భ్యుల‌కు ఎంట్రీ లేదు. శ‌నివారం జ‌రిగిన బిఎసి స‌మావేశానికి టిడిపి నుంచి స‌భ్యుడైన సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను రానీయ‌లేదు. ఇదంతా చూస్తుంటే… పైన చెప్పిన మాట‌లు త‌క్కువే అంటున్నారు రాజ‌కీయ పండితులు.

. ముస్లింల‌కు, ద‌ళితుల‌కు, గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచ‌డం కోసం కేబినెట్ లో నిర్ణ‌యం తీసుకున్నారు. అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌రుపుతున్నారు. అయితే ఈ స‌మావేశాల‌కు ముందుగా జ‌రిగే… బిజినెస్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌మావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన సండ్ర వెంక‌ట వీర‌య్య‌ను రానీయ‌లేదు. ఎందుక‌ని అడిగితే… మిమ్మ‌ల్ని ఒక సెష‌న్ మొత్తానికి స‌స్పెండ్ చేశాము కాబ‌ట్టి… రావొద్ద‌ని అంటున్నార‌ట‌. మ‌రి ఇవి ప్ర‌త్యేక సెష‌న్స్ క‌దా అని అడిగితే… ప్ర‌త్యేక సెష‌న్స్ కాద‌ని అసెంబ్లీ సిబ్బంది అంటున్నారు.

మొన్న జ‌రిగిన బ‌డ్జెట్ సెష‌న్స్ లో స‌ర్కారు తీరును స‌మ‌ర్థంగా ఎండ‌గ‌ట్టి ప్ర‌జావాణి వినిపిస్తున్న రేవంత్ రెడ్డిపై స‌ర్కారు గుర్రుగా ఉంది. రేవంత్ ప్ర‌శ్న‌ల వ‌ర్షంతో ఉక్కిరి బిక్కిరైన స‌ర్కారు ఉత్త పుణ్యానికే సెష‌న్ మొత్తానికి టిడిపి స‌భ్యులను స‌స్పెండ్ చేసింది. అయితే రిజ‌ర్వేష‌న్ల పేరుతో న‌డిపే ప్ర‌త్యేక సెష‌న్స్ లో కూడా వీరికి ఎంట్రీ నిరాక‌రించారు. ఈ వ్య‌వ‌హారం చూస్తుంటే… వ్య‌క్తిగ‌త క‌క్ష సాధింపు చ‌ర్య‌లుగా అభివ‌ర్ణిస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

రిజ‌ర్వేష‌న్లు కెసిఆర్ త‌న జేబులోంచి ఇచ్చేవి కావ‌ని… ఈ విష‌యంలో బిసిల‌ను, మైనార్టీల‌ను, ఎస్సీ, ఎస్టీల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత రేవంత్ రెడ్డి చాలా గ‌ట్టిగానే వాయిస్తున్నారు. కేంద్రం మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు అనుమ‌తిస్తుందా అని… ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కారు దోబూచులాడ‌డం స‌రికాద‌ని విమ‌ర్శిస్తున్నారు రేవంత్‌. అయితే మిగ‌తా పార్టీలు సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేస్తూ కాల‌మెల్ల‌దీస్తున్నాయి. కానీ రేవంత్ మాత్రం స‌భ బ‌య‌ట ప్ర‌జ‌ల్లో ఉన్న అనుమానాల‌ను, ఆందోళ‌న‌ల‌ను వెల్ల‌డిస్తున్నారు. దీంతో పాల‌క పెద్ద‌ల‌కు మింగుడు ప‌డ‌డంలేదు. ఇక రేవంత్‌ను స‌భ‌లోకి రానిస్తే… త‌మ క‌ప‌ట నాట‌కాలు బ‌ట్ట‌బ‌య‌లు అవుతాయ‌న్న భ‌యం ప‌ట్టుకుందేమో… ? అందుకే… స‌భ‌లో రేవంత్ అడుగు పెట్ట‌కుండా ఉండాలంటే… స‌స్పెన్ష‌న్ స్టిల్ కంటిన్యూ… అని అసెంబ్లీ సిబ్బందిచేత చెప్పించారు.

మ‌రి నిజానికి తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీగా ఉన్న టిడిపి త‌న వైఖ‌రి వెల్ల‌డించ‌కుండా, అసెంబ్లీ స‌మావేశాల‌కు రాకుండా అడ్డుకోవ‌డం ఏర‌కంగా రాజ్యాంగ‌బ‌ద్ధం అవుతుందో చెప్పాల‌ని విమ‌ర్శిస్తున్నారు టిడిపి నేత‌లు. భ‌జ‌న చేసేవాళ్ల‌నే అసెంబ్లీలోకి రానిస్తామ‌ని… విమ‌ర్శిస్తే… రానీయ‌మ‌న్న ధోర‌ణి స‌రికాదంటున్నారు. ఈ విష‌యంలో ఒక ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీని ప్ర‌త్యేక స‌మావేశాల‌కు రాకుండా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును మిగ‌తా రాజ‌కీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి, ఎంఐఎం, సిపిఎం ఎలా స్పందిస్తాయో చూడాలి.

To Top

Send this to a friend