రెండేళ్లే.. జనసేనాని మేలుకో..

జనం కోసం జనసేన అన్నాడు.. అమావాస్యకు , పౌర్ణమికే పలకరిస్తున్నాడు. సునామీలా ఎగిసి.. చప్పగా తీరాన్ని తాకుతున్నాడు. మాటలో, చేతల్లో ఉన్న వేడి..ఆచరణలో కరువవుతోంది.. జనసేన.. ఇప్పుడు జనంలో లేదు.. జనసేనానికి ఆదరణ అంతకంతకూ తగ్గిపోతోంది.. ఎందుకీ పతనం..? అన్నలా తమ్ముడూ అమావాస్య చంద్రుడేనా..? ప్రజారాజ్యం బాటలోనే.. జనసేన నడుస్తోందా.? అడుగులు అలానే ఉన్నాయి.. ఇంతకీ జనసేనలో ఏం జరుగుతోంది.?

* ఇలా అయితే పవన్ ఎలా గెలుస్తాడో..?
పవన్ కళ్యాణ్ కు అన్యాయం కనిపించినప్పుడు రక్తం ఉడుకుంది.. ట్విట్టర్ ఓపెన్ చేసి చడామడా తిట్టేస్తారు.. ఆయన అభిమానులు పండగ చేసుకుంటారు. ఇటీవల దక్షిణాది వాళ్లను నల్లవాళ్లు అన్నందుకు పవన్ ఇలాగే బీజేపీ నేతపై విరుచుకుపడ్డారు. కానీ నిజంగా పవన్ మనోభావాలు ఆయన పోటీచేయాలనుకుంటున్న ఏపీ ప్రజలు ఎంత వరకు తెలుస్తున్నాయి.? ఏపీలోని ప్రజల్లో ఎందరికీ ట్విట్టర్ అకౌంట్లున్నాయా.?. ఎందరు సోషల్ మీడియాను ఫాలో అవుతారు.. ఎంతమందికి పవన్ లోని కోపం.. అసహనం చేరుతుంది. పోనీ పార్టీ బలం ఉందంటే అదీ లేదు.. పవన్ గాలిలో మేడలు కట్టేస్తున్నారు. గ్రామ, మండలస్థాయి నుంచి కార్యకర్తల బలం లేకుండా నాయకులు లేకుండా మంది మార్బలం లేకుండా రాత్రికి రాత్రే 2019లో ఏపీ సీఎం కావాలని కలలు కంటున్నాడు. రాజకీయాల్లో ఎప్పుడూ ఆవేశం పనికిరాదు. అది జగన్ ను చూస్తేనే తెలుస్తుంది. అలాగే అతివిశ్వాసం కూడా పనికిరాదు. పవన్ అన్నయ్య చిరంజీవి దెబ్బైపోయింది అలానే.. మరి ఈ ఇద్దరి వైఖరి కాకుండా పవన్ రాజకీయాల్లో ఏ స్ట్రాటజీతో వస్తున్నారు. పార్టీ నిర్మాణం లేకుండా.. నాయకులు లేకుండా కేవలం ట్విట్టర్ ద్వారా ప్రచారం చేస్తారా.? ఏపీలో పవన్ ను పక్కనపెడితే జనాలకు తెలిసిన ముఖం ఒక్కటైనా లేదు.. అసలు పవన్ లోని నిజమైన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు బయటకు రాలేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ రెండు సినిమాలు తీసుకుంటూ షూటింగ్ మధ్యలో జనాలు బాధలు వినే పంచాయతీ పెద్దలా కనిపిస్తున్నారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. ఓవైపు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఏపీలో ఎంతో బలంగా ఉన్నాయి. నాయకులు, కార్యకర్తలతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. జనసేనకు పవన్ ఒక్కడే.. పవనే జనసేనాని.. అంతకుమించి ఎవరున్నారో ఎవ్వరికీ తెలీదు.. అందుకే పవన్ ఎన్ని ఊదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నా.. తొలినాళ్లలో ఉన్న వేడి.. ఇప్పుడు లేదంటున్నారు రాజకీయ పండితులు..

* ఆచరణ కావాలి.. గ్రూపులు ఏకతాటిపైకి రావాలి..
పవన్ కళ్యాణ్ లో కావలసినంత కసి ఉంది. ప్రజాసమస్యలపై స్పందించే గుణముంది.. కానీ ఆ కసిని రాజకీయాల్లోకి వచ్చి జనాలకు మేలు చేసేలా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఆయన పక్కనున్న వాళ్లే పవన్ కు రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు. జనసేన పార్టీలో జిల్లాల్లో గ్రూపులు, అభిమాన సంఘాల పేర చేస్తున్న హడావుడి కూడా పవన్ కు చేటు తెస్తోంది. ఇటీవల నెల్లూరులో పవన్ వర్గానికి చెందిన ఒక గ్రూపు.. మరో పవన్ గ్రూపు మీద బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటున్నారని స్థానిక డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.. ఈ రెండు గ్రూపులకు జనసేన పార్టీలోనే అండదండలున్నాయి. హైదరాబాద్ లోని నాయకులు తమ ఆదిపత్యం ప్రదర్శించడానికి వీటిని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసింది. తిరుపతిలో కూడా ఒకరిమీద ఒకరు పవన్ అభిమానులే కేసులు పెట్టుకున్నారు. ఇదంతా అధిష్టానం వద్దగల ఆఫీసు నుంచే జరిగిందనేది ఇన్ సైడ్ టాక్.. అనంతపురంలో అంతర్గతం ఉన్న గ్రూపిజం వల్ల అదే పరిస్థితి దాపురించింది. ఆఫీసునుంచే ఈ గ్రూపిజం పెంచిపోషిస్తున్నారనే అనుమానాలున్నాయి. గ్రూపిజం కంట్రోల్ చేయడంలో పవన్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనలు కూడా పవన్ కు ఆశించిన మైలేజీ తీసుకురావడం లేదు. అనంతపురం, ఉద్దానం పర్యటనలు, చేనేత గర్జన, అగ్రిగోల్డ్ సమావేశాల తర్వాత ఏం సాధించాడో పవన్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని బాధితులే కోరుతున్నారు. ఇటీవల అనంతపురం నుంచి బరిలోకి దిగుతానని చెప్పి అక్కడ కార్యాలయం.. నాయకుల కోసం కసరత్తు చేశారు. జనసేన నాయకుల నిర్లక్ష్యం, అసమర్థత వల్ల అనంతపురం పర్యటనను పవన్ అర్థాంతరంగా వాయిదా వేసుకున్నారు. ఇది జరిగి ఉంటే రాజకీయంగా పవన్ కు తొలి అడుగు పడి ఉండేది. కానీ జరగలేదు.. పవన్ లోని ఈ నిర్లిప్తతే ఆయన పార్టీని జనానికి దూరం చేస్తోంది.

*పోటీ చేస్తావా..? జగన్/బాబుతో వెళ్తావా..?
పవన్ కు కార్యకర్తలు నాయకుల బలం లేని కారణంగా గడిచిన 2014 ఎన్నికల్లో బీజేపీ-టీడీపీకి మద్దతిచ్చి వారు గద్దెనెక్కడానికి సహకరించారు. అప్పుడూ పార్టీ నిర్మాణం లేదని అలా చేశారు. మూడేళ్లు గడిచిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఇప్పటికీ పార్టీకి రూపు రేఖలు లేవు. మళ్లీ ఒకవేళ మద్దతిస్తే పవన్ ఎటువైపు మొగ్గుచూపుతారు.. ప్రత్యేక హోదా కోసం మాట ఇచ్చి మోసం చేసిన బీజేపీ-టీడీపీతో కలిసి నడుస్తారా..? లేక ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రతిపక్ష వైసీపీతో వెళ్తారా.? పవన్ కే ఈ విషయంలో స్పష్టత లేదు. ఒకవేళ బాబును నమ్మి మరలా కలిస్తే పవన్ ను జనం బొందపెట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.. హోదా ఇవ్వని బాబు కూటమిలో పవన్ చేరకపోవడమే మంచిదంటున్నారు. మరి హోదా కోసం పోరాడుతున్న జగన్ తో దోస్తీ చేస్తారా.? అంటే అనుమానమే.. సొంతంగా రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న పవన్ కు ప్రధాన ప్రత్యర్థి జగనే.. అందుకని ఆయనతో కలిసి పోటీచేయడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి ఒంటరిగా బరిలోకి దిగుతారా అంటే అదీ మరి కష్టం.. పార్టీ నిర్మాణం లేకుండా నాయకులు లేకుండా మరే ఇతర పార్టీలకు మద్దతివ్వకుండా జనసేనాని ఏం చేస్తాడనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ఏదీ ఏమైనా ఇలానే కాలయాపన చేస్తే మరో ప్రజారాజ్యంలా.. జనసేన అంతర్థానం ఖాయమంటున్నారు విశ్లేషకులు..

*తెలంగాణలో అంత ఈజీకాదు..
ఏపీలో జనాలను ఉద్దరించడంలో సక్సెస్ కాలేకపోతున్న జనసేనాని పవన్.. తెలంగాణలోనూ పోటీచేస్తానని అప్పట్లో ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు నవ్వుకున్నారు.. ఎందుకంటే జనసేనలో ప్రస్తుతం పవన్ ను పక్కనపెడితే రాష్ట్ర ప్రజలకు తెలిసిన ఒక్క ముఖం లేరు. ఎవరు నాయకులు.. ఎవరు జనసేన పార్టీ కార్యకర్తలు.. ఏదీ ఆ పార్టీ నిర్మాణం.. ఎక్కడ పార్టీ కార్యకలాపాలు.. అందుకూ సినిమాల్లో పేలుతున్న పంచ్ డైలాగులు.. బయట కూడా పేల్చేసరికి తెలంగాణలో నాయకులు ఫక్కున నవ్వారట.. ఈ మధ్య టీఆర్ఎస్ నాయకుల సంభాషణల్లో పవన్ ప్రకటన చూసి సెటైర్లు వేసుకున్నారట.. తెలంగాణలో ఎప్పటికీ పవన్ కు అంత సీను లేదు.. ఇటీవల తెలంగాణ అధ్యక్ష, నిర్వహణ బాధ్యతలను శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి అనే వ్యక్తులకు అప్పగించారు. వారెవరో.. వారి పని ఏంటో ఎవ్వరికీ తెలీదు.. తెలంగాణ బాధ్యతలు అప్పగించినా వారు ఇంత వరకు తెలంగాణలోని జిల్లాలకు వెళ్లి పార్టీని బలోపేతం చేసింది లేదు. పోనీ నాయకత్వాలను, కార్యకర్తలను ఏర్పాటు చేసింది లేదు. తెలంగాణలో బలమైన నాయకులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పలేదని విమర్శలు వస్తున్నాయి. ఇక తెలంగాణ విషయంలో పవన్ సైతం తప్పటడుగులు వేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ వెళ్లి పవన్ సినిమా చూసి ఆయనతో ఫొటో దిగి ఏదో మంత్రాంగం నడిపాడు. పవన్ తెలంగాణలో పోటీచేసేది టీఆర్ఎస్ పైనే.. అలాంటి టీఆర్ఎస్ నాయకుడి కొడుకుతోనే పవన్ సాన్నిహిత్యంగా మెలగడంతో పవన్ పార్టీపై పవన్ పై ఆ పార్టీ నాయకుల్లో .. జనంలో ఏలాంటి నమ్మకం ఏర్పడుతుందో పవన్ అర్థం చేసుకోవాలంటున్నారు విశ్లేషకులు..

*ప్రజారాజ్యంలా కానివ్వకు..
తిరుపతిలో చిరంజీవి ప్రజారాజ్యం సభ పెడితే లక్షల మంది వచ్చారు. కానీ ఓట్ల దగ్గరికి వచ్చే సరికి చిరంజీవికి అవేవీ పడలేదు. జనాభిప్రాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఎంతగొప్ప నటుడైనా.. రాజకీయ నాయకుడైనా అసంబద్ధ విధానాలు అవలంబిస్తే ఖచ్చితంగా ఓడిస్తారు. నాడు ఎన్టీఆర్.. ను.. నేడు చిరంజీవిని ఓడించారు. ఇప్పుడు పవన్ .. ప్రజారాజ్యంలాగానే దూదిపింజ పార్టీని స్థాపించి ముందుకెళ్తున్నారు. ఎలాంటి బలం.. బలగం లేకుండా సాగుతున్నారు.. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఇంకా పార్టీ నిర్మాణం, నాయకులు లేకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కు కూడా చిరంజీవి గతే పడుతుందనే సందేహం అందరిలో ఉంది. ఎందుకంటే జనం ఎప్పుడు తమతో ఉండేవారిని.. తమలో ఒకరిగా ఉండేవారిని గెలిపిస్తారు.. ఉళ్లో ఉన్నోడినే సర్పంచ్ గా గెలిపిస్తారు.. కానీ పక్క ఊరి నుంచి వచ్చి నెలకో.. రెండు నెలలకో ఊదరగొట్టే ప్రసంగాలు చేసే వాడిని జనం ఎందుకు గెలిపిస్తారు.. ఇప్పుడు అదే స్ట్రాటజీ పవన్ కు వర్తిస్తుంది.

To Top

Send this to a friend