రెడ్లు, రావులు కంటే వీళ్లే ముద్దు..


సీఎం కేసీఆర్ 2019 ఎన్నికల కోసం ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని ప్లాన్ చేశారు. తెలంగాణలో బలమైన, పెత్తనం చెలాయించే రెడ్లు, వెలమ సామాజికవర్గాలకు ఇప్పటికే అందలం దక్కింది. అందుకే వారిని వదిలేసి మిగితా ఎస్టీ, బీసీలతో పాటు ముస్లింలను తమ ఓటు బ్యాంకుగా చేర్చుకునేందుకు మాస్టర్ ప్లాన్ గీశారు. అందుకోసం ఏకంగా తమిళనాడు తరహాలో ఆయా వర్గాలకు రిజిర్వేషన్లు కల్పించేందుకు నిర్ణయించారు..

తెలంగాణలో రిజర్వేషన్ల కోటాను పెంచేందుకు సీఎం కేసీఆర్ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు సారథ్యంలోని బృందంతో సర్వే నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదికను కేసీఆర్ కు మంగళవారం అందజేశారు. ఈ నేపథ్యంలోనే బీసీ, ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్ల పెంపు ముసాయిదా బిల్లులపై బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఆమోదముద్ర వేయనుంది. ఇందులో ముస్లిం-4 నుంచి 12శాతం, ఎస్టీ-6 నుంచి 9శాతం, బీసీలకు ఇప్పుడున్న రిజర్వేషన్లకు అదనంగా మరో నాలుగు శాతం పెరగనున్నాయి.

ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదిస్తే తెలంగాణలో రిజర్వేషన్లు పెరుగుతాయి. ఇవి తమిళనాడులో ప్రస్తుతం కల్పించే రిజర్వేషన్లకు సమానం.. రిజర్వేషన్లు 50శాతం దాటడంతో జరిగిన విధంగా న్యాయ సమీక్షకు వీల్లేకుండా రాజ్యాంగంలోని షెడ్యూలు-9లో ఈ అంశాన్ని చేర్చాలని కోరుతూ శాసనసభ, మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నాయి. పార్లమెంటు సమావేశాలు బుధవారంతో ముగుస్తున్నందున , జూన్ లేదా జులైలో జరిగే సమావేశాల్లో దీనిపై చర్చించే వీలుంది. మరోవైపు ఈ రిజర్వేషన్ల అంశంపై అప్పుడే రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది.

To Top

Send this to a friend