‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ రివ్యూ

చిత్రం : రారండోయ్‌ వేడుక చూద్దాం
రేటింగ్‌ : 2.75/5.0
బ్యానర్‌ : అన్నపూర్ణ స్టూడియోస్‌
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్‌
దర్శకుడు : కళ్యాణ్‌ కృష్ణ కురసాల
నిర్మాత : అక్కినేని నాగార్జున
విడుదల : మే 26, 2017

స్టారింగ్‌ : అక్కినేని నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌ రాజ్‌, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, బెనర్జీ, అన్నపూర్ణ, పృథ్వీ మొదలగు వారు.

‘సోగ్గాడే చిన్ని నాయన’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌తో ఆకట్టుకున్న దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ మరోసారి అదే తరహా సినిమాగా ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పూర్తి స్థాయి ఫ్యామిలీ చిత్రంగా ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి చెబుతూ వచ్చారు. టీజర్‌, ట్రైలర్‌ మరియు పాటలు అన్ని కూడా కలర్‌ఫుల్‌గా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. నాగార్జున నిర్మాత అవ్వడం కూడా సినిమాకు కలిసి వచ్చే విషయం. భారీ అంచనాలున్న ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

కథలోకి వెళితే : కథ చాలా రొటీన్‌గా ఉంది. ఒక కుటుంబంలో రాజకుమారిగా, అల్లారు ముద్దుగా భ్రమరాంబ(రకుల్‌ ప్రీత్‌సింగ్‌) పెరుగుతుంది. తండ్రి అంటే ఇష్టం, గౌరవం కలిగిన భ్రమరాంబ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎంతో స్పెషల్‌. అలాంటి భ్రమరాంబ ఒక పెళ్లిలో శివ(నాగచైతన్య)ను కలుస్తుంది. మొదటి చూపులోనే భ్రమరాంబను శివ ప్రేమిస్తాడు. అయితే ఆమె మాత్రం స్నేహితులుగా ఉండాలని భావిస్తుంది. ఆ తర్వాత భ్రమరాంబ కూడా తాను శివను ప్రేమిస్తున్నట్లుగా తెలుసుకుంటుంది. అదే సమయంలో శివ తండ్రికి, తన తండ్రికి విభేదాలున్నాయని తెలుసుకుంటుంది. శివతో భ్రమరాంబ పెళ్లికి ఆమె తండ్రి ఒప్పుకోడు. అప్పుడు శివ ఏం చేస్తాడు, ఇంతకు వీరిద్దరి తండ్రులకు విభేదాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల ఫర్ఫార్మెన్స్‌ : లవర్‌ బాయ్‌గా నాగచైతన్య ఆకట్టుకున్నాడు. లవ్‌ సీన్స్‌తో పాటు, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా చైతూ బాగా నటించాడు. అమ్మాయి ప్రేమను గెలుచుకునేందుకు ఒక కుర్రాడు పడే తపన చైతూ బాగా కనబర్చాడు. ఇక హీరోయిన్‌ రకుల్‌ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలో ఈమె పాత్ర చాలా ముఖ్యమైనది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇప్పటి వరకు రకుల్‌ చేసిన సినిమాల్లో ఇందులో ది బెస్ట్‌ నటన ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రకుల్‌ లుక్‌ కూడా చాలా బాగుంది. ఎక్కడ హద్దులు దాటకుండా, అందాలను ఎంత కావాలో అంత ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఇక జగపతిబాబు, సంపత్‌ రాజ్‌ు మంచి నటనతో మెప్పించారు. వెన్నెల కిషోర్‌ తన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతికపరంగా: దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం బాగుంది. ముఖ్యంగా మూడు పాటలు చాలా బాగున్నాయి. సినిమా విడుదల కాకుండానే పాటలు ఆకట్టుకున్నాయి. సినిమాలో పిక్చరైజేషన్‌తో ఆ పాటలకు మరింత అందం చేకూరింది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. సినిమా అంతా కలర్‌ఫుల్‌గా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. పాటల్లో కూడా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో మరింతగా కట్స్‌ ఉంటే బాగుండేది. దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ స్క్రీన్‌ప్లేపై మరింత శ్రద్ద పెట్టి ఉండాల్సింది. దర్శకత్వం పర్వాలేదు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్లుగా సినిమా కలర్‌ ఫుల్‌గా ఉండటంలో నిర్మాణాత్మక విలువుల ఉన్నాయి.

విశ్లేషణ: సోగ్గాడే.. చిత్రంతో సక్సెస్‌ అందుకున్న కళ్యాణ్‌ కృష్ణ మరోసారి ఫ్యామిలీ చిత్రంతో అనగానే అంచనాలు అందరిలో పెరిగి పోయాయి. అయితే అంచనాల స్థాయిలో సినిమా లేదని చెప్పాలి. ఎందుకంటే కథ ఒక రొటీన్‌ ఫార్మట్‌లో ఉంది. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, వారి కుటుంబాల వల్ల ఇబ్బందులు పడటం, హీరో చివరకు రెండు కుటుంబాలను ఏకం చేయడం అనే కథలు తెలుగులో ఎన్నో వచ్చాయి. ఇక్కడ కాస్త అటు ఇటుగా అలాగే ఉంది. అందుకే కథలో కొత్తదనం లేదని చెప్పవచ్చు. కథ పాతదే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా నడిపించి కథను డామినేట్‌ చేయవచ్చు. కాని స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌ ఎంటర్‌టైనర్‌గా సాగింది. కొన్ని చోట్ల మినహా అన్ని సీన్స్‌ కూడా సాదా సీదాగా సాగాయి. అయితే ఫ్యామిలీ చిత్రాలు తక్కువగా వస్తున్న ఈ సమయంలో అవన్ని పట్టించుకోకుండా చూస్తే ఒకసారి ఎంజాయ్‌ చేయవచ్చు.

ప్లస్‌ పాయింట్స్‌ :
చైతూ, రకుల్‌,
జగపతిబాబు, సంపత్‌రాజ్‌,
కామెడీ సీన్స్‌,
సినిమాటోగ్రఫీ,
సంగీతం, క్లైమాక్స్‌.

నచ్చనివి :
ఎడిటింగ్‌,
రొటీన్‌ కథ, స్క్రీన్‌ప్లే

చివరగా : వేడుకకు ఫ్యామిలీ అంతా వెళ్లి ఎంజాయ్‌ చేయొచ్చు.

To Top

Send this to a friend