నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి భారీ అంచనాల నడుమ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుంది. ఒక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంది తప్ప, కొత్త అంశాలు ఏమీ లేవు అంటూ చిత్రంపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరే సినిమా లేదు. దాంతో రారండోయ్ చిత్రానికే వెళ్తున్నారు.
ఇక తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ నాగచైతన్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన చిత్రంగా నిలిచిందంటూ గొప్పలు చెబుతున్నారు. మొదటి వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా షేర్‌ను సాధించిందని గొప్పలు చెబుతున్నారు. అయితే ట్రేడ్ పండితులు చెబుతున్నదాని ప్రకారం చిత్ర యూనిట్ చెబుతున్న లెక్కల్లో బొక్కలు ఉన్నాయి.
ఇప్పటి వరకు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం 14 కోట్ల వసూళ్లను సాధించిందని, మరో 5 కోట్ల వరకు వసూళ్లు చేసే అవకాశం ఉందని, మొత్తంగా 20 కోట్లకు ఈ చిత్ర కలెక్షన్స్ చేరడం కష్టంగా ఉందని, అలాంటిది మొదటి వారంలోనే 20 కోట్లు వసూళ్లు సాధించిందని ప్రచారం కోసం ప్రకటిస్తున్నారంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్ అని ఇటీవలే రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. పబ్లిసిటీ కోసం కలెక్షన్స్‌ను ఎక్కువ చేసి చెప్పడం చైతూ చిత్రానికి ఇదే మొదటిసారి. ఫేక్ కలెక్షన్స్ దారిలో చైతూ కూడా నడుస్తున్నాడన్నమాట.
