హిజ్రాల‌పై కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్‌!

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే నిత్యం త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి రూ.5 ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహం, గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగం క‌ల్పించేలా రాష్ట్రాలు చొర‌వ తీసుకోవాల‌ని అథ‌వాలే గ‌తంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ కూడా రాశారు. భార‌త క్రికెట్ జ‌ట్టులో రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కారం ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయాలంటూ స‌రికొత్త ప్రతిపాద‌న‌ను తెర‌పైకి తీసుకు వ‌చ్చి సంచ‌ల‌నం రేపారు. తాజాగా, వందేమాతర గీతాన్ని అంద‌రూ పాడాల్సిందేన‌ని, ఒక వేళ ఎవ‌రన్న పాడ‌క పోయినా అందులో త‌ప్పేమీ లేద‌ని అథ‌వాలే వ్యాఖ్యానించారు. ఇలా త‌న అభిప్రాయాల‌ను బాహాటంగా వెల్ల‌డిస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం అథ‌వాలేకు అల‌వాటే. అదే త‌ర‌హాలో అథ‌వాలే మరో సారి వార్త‌ల్లోకెక్కారు.

ఈ సారి అయ‌న ట్రాన్స్ జెండ‌ర్ల‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆడ‌, మ‌గ కాని ట్రాన్స్ జెండ‌ర్లు చీర క‌ట్టుకోకూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. ట్రాన్స్ జెండ‌ర్లు ఆడ, మగ కాద‌ని…వారు మ‌నుషుల‌ని అన్నారు. సోమవారం జరిగిన ‘డెవలపింగ్ మాడ్యూల్స్ ఫర్ సెన్సిటైజింగ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అండ్ స్టేక్ హోల్డర్స్’ వర్క్‌షాపులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం విశేషం. హిజ్రాలు చీరలు ధరించకూడ‌ద‌న్న‌ది కేవ‌లం తన అభిప్రాయం మాత్రమేనని అథ‌వాలే స్పష్టం చేశారు. కొంత‌మంది హిజ్రాలు ప్యాంటు చొక్కా ధ‌రిస్తున్నార‌ని అన్నారు. ఒక వేళ హిజ్రాలు చీర‌లు క‌ట్టుకుంటామ‌న్నా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, తాను కేవ‌లం వ్య‌క్తిగ‌త అభిప్రాయాన్ని మాత్ర‌మే వెల్ల‌డించాన‌ని అథ‌వాలే చెప్పారు.

దేశంలో ఆరు లక్షలమందికి పైగా హిజ్రాలు ఉన్నారని, వారంద‌రికీ స్త్రీ, పురుషులతో సమానంగా సమాజంలో గౌరవం ద‌క్కేలా చట్టం తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఆ చ‌ట్టం కోసం బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెడతామన్నారు. అలాగే హిజ్రాల‌ కోసం ప్రత్యేకంగా పాఠశాలలను ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. పాఠ‌శాల‌లు, ఇతర పనులకు వెళ్తున్నప్పుడు వారిని చాలామంది చీదరించుకుంటున్నారని, అందుకే వారు చదువుకు దూరంగా ఉండిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

To Top

Send this to a friend