రాజమౌళి, అల్లు అర్జున్ కలిసి..

 

ఇద్దరు సెలబ్రెటీలు హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. వారెవరో కాదు.. దిగ్గజ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరో అల్లు అర్జున్. వీరిద్దరూ కలిసి విద్యార్థులకు రో్డ్డు ప్రమాదాల వల్ల కలిగే కష్టానష్టాలను వివరించి స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో విద్యార్థులకు పోలీసులు రోడ్డు సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ బార్డర్ సైనికులు వందల మరణిస్తేనే మనకు కోపం వస్తోంది. కానీ రోడ్డు ప్రమాదల వల్ల ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ఉగ్రవాదం కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. మనదేశంలో ఏటా ఉగ్రవాదుల దాడుల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా జనాలు చనిపోతున్నారు. ఇప్పటికీ దేశంలో రోడ్డు భద్రత, నియమాలు ఎవరూ పాటించరు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, పిల్లలకు వాహనాలు ఇవ్వడం , మద్యం తాగి నడపడం ఇక్కడ నిత్యకృత్యం. అందుకే రోడ్డు ప్రమాదాలు.. అందులో చనిపోవడం సర్వసాధారణంగా మారిందని రాజమౌళి వాపోయారు.

 

అనంతరం మాట్లాడిన అల్లు అర్జున్ తన జీవితంలో జరిగిన యాథార్థ ఘటనను విద్యార్థులకు వివరించి రోడ్డు ప్రమాదాలపై చక్కగా అవగాహన కల్పించారు. బన్నీ మాట్లాడుతూ ‘తాను 19 ఏళ్లు ఉన్నప్పుడు ఓ పార్టీలో నా ఫ్రెండ్ తో గొడవపడ్డా. ఆమె కోపంతో బయటకు వచ్చి కారుతీసుకొని వెళ్లిపోయింది. నేను నా కారులో ఆమెను వెంబడించా.. ఆ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంతో మరో కారును ఢీకొట్టబోయా.. కానీ సడన్ బ్రేక్ వేసేసరికి కారు ముందుకొచ్చి ఆగిపోయింది.. అందులోంచి ఓ నిండు గర్భిణి దిగి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా నా వైపు చూసింది. నన్నే ఏమీ అనలేదు. కానీ ఆమె చూసిన చూపు నాకు జీవిత పాఠాన్ని నేర్పింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను స్పీడ్ గా డ్రైవింగ్ చేయలేదు. ’’ అని అల్లు అర్జున్ తనకు ఎదురైన గుణపాఠాన్ని విద్యార్థులకు వివరించారు. మనం వేగంగా వెళ్లడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నామని అలా చేయవద్దని విద్యార్థులకు వివరించారు.

To Top

Send this to a friend