వరుణుడొచ్చి బాబు పరువు తీశాడు

అంతర్జాతీయ నగరం.. సింగపూర్ ప్రభుత్వం స్కెచ్ గీస్తోంది. అంతర్జాతీయ సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చాడు. ఆగమేఘాల మీద 6 నెలల్లోనే కట్టడాలు పూర్తి చేశారు. అమరావతి నగర ఆ ఆపురూప శిల్పాలు చూసి చంద్రబాబు అనుకూల మీడియా, నాయకులు ఆహా.. ఓహో అంటూ చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. 6 నెలల్లోనే ఏపీ సచివాలయం, అసెంబ్లీ భవనాలను తాత్కాలిక పద్ధతిన పూర్తి చేశారు.

చంద్రబాబు మార్గదూర్శి, దూరదృష్టి, పనిరాక్షసుడు.. ఇలాంటి ఉపమానాలెన్నో చంద్రబాబుకు ఆపాదించి పొగిడేశారు. ఆయనే ఏపీని తీర్చిదిద్దుతాడని అందరూ వేయినోళ్ల పొగిడారు. కానీ ఏమైంది.. ఒకే ఒక్కడు.. ఆ వరుణుడు చంద్రబాబు పరువును గంగలో కలిపాడు. ఒక్క వానకే.. అమరావతి నీటి పాలైంది. చిన్నపాటి చెరువును తలపిస్తోంది. చంద్రబాబు ఆర్భాటంగా కట్టిన నూతన అసెంబ్లీ, సచివాలయాలు వర్షానికి లీకేజీలు అయ్యి నీరు కారుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం , ఇతర బ్లాకులు, ప్రతిపక్ష నేత జగన్ చాంబర్ నీటితో నిండిపోయింది.

ఇంతటి ఆర్భాటపు భవనాలన్నీ తొందరగా పూర్తికావాలని కోట్ల ప్రజాధనం పెట్టి కట్టించారు. కానీ వాటిలో నాణ్యత లోపించింది. ఇప్పుడు అన్నీ ఊరుస్తున్నాయి. కోట్ల ప్రజాధనం వృథాగా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంటూ తమకు దగ్గరైన ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టు ఇచ్చి వందల కోట్ల ఖర్చు పెట్టిన ఏపీ సీఎం బండారం ఒక్కవానతో బట్టబయలైంది. కేవలం 20 నిమిషాల వానకు అసెంబ్లీ, సచివాలయం ఇలా జలదిగ్భంధంలో చిక్కితే రేపు పొద్దున ఏదైనా తుఫాను వస్తే ఏంటీ పరిస్థితి అనే ప్రశ్న ఉదయిస్తోంది. నిర్మించి సంవత్సరం కూడా పూర్తికానీ ఈ భవనాలు పాత పెంకిటిల్లు మాదిరిగా కూలిపోవడం.. నీరు గారడం చూసి మీడియా కవర్ చేయడానికి వెళితే అధికారులు అనుమతించకపోవడం కొసమెరుపు.. అమరావతి పరువు పోతుందని చంద్రబాబే మీడియాను అనుమతించలేదని అధికారులు చెప్పడం గమనార్హం.

To Top

Send this to a friend