సింగం బయలు దేరింది..

రజినీ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కొద్దిరోజులుగా ప్రజలు, అభిమానులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడానికి తటపటాయిస్తున్న రజినీ మొత్తానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం…

జూలైలో రజినీకాంత్ తన కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని రజినీ సోదరుడు సత్యనారాయణ రావు గైక్వైడ్ వెల్లడించారు. రజినీకాంత్ మే 15 నుంచి 19 వరకు 15 జిల్లాల అభిమానులతో మారోసారి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భేటిలోనే రజినీ రాజకీయ ప్రవేశం గురించి అధికారికంగా ప్రకటిస్తారని రజినీ తమ్ముడు వెల్లడించారు.

ప్రస్తుతం రోబో 2.0 సినిమా చివరి దశలో ఉంది. దాంతో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రజినీ తీస్తున్న కాలా కరికాలన్ సినిమా షూటింగ్ పనుల వల్ల అభిమానులతో భేటి ఇటీవల వాయిదా పడిందట.. రాజకీయ ప్రకటనకు ముందు జూన్ , జూలై నెలల్లో రజినీకాంత్ మరిన్ని సమావేశాలు నిర్వహిస్తారని ఆయన తమ్ముడు వివరించారు.

రజినీకాంత్ జూలైలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లు బలమైన జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి ధాటికి నిలబడడం కష్టమని రాజకీయాల్లోకి రాకుండా ఉన్న రజినీ జయ మరణం.. కరుణానిధి వృద్ధాప్యంతో దూరంగా ఉండడంతో ఇలాంటి సంధి సమయంలో రాజకీయాల్లోకి వస్తే అధికారంలోకి రావడం ఖాయమని రజినీ భావిస్తున్నారు. అందుకే జూలైలో పార్టీ ప్రకటన చేయనున్నట్టు రజినీ సన్నిహితులు చెబుతున్నారు.

To Top

Send this to a friend