ప్రక్షాళన గావించదా..?


ఏవో గాలిమాటలు.. హామీల మూటలు.. అచ్చేదిన్ ఆశలు తప్ప ఏవీ లేవు.. కానీ ఈయన చూస్తుంటే మోడీ కంటే స్పీడుగా ఉన్నాడు.. మోడీ మాటల్లో ఊదరగొట్టడం తప్పితే ఇప్పటివరకు వేగంగా నిర్ణయాలు తీసుకున్న పాపాన పోలేదు. ఒక్క పథకమైనా సామాన్యుడికి.. పేదవారికి నేరుగా లబ్ధి చేకూరేలా ప్రవేశపెట్టలేదు. కానీ యూపీ సీఎం స్పీడు పెంచాడు.. యోగి కావడంతో పిల్లా పాప.. కుటుంబ బంధాలకు అతీతుడుగా ఉన్నాడు. బంధుప్రీతి లేదు కనుక యూపీసీఎం ఆదిత్యనాథ్ ప్రజలే తన కుటుంబం అంటున్నాడు..

యూపీ సీఎం ఆదిత్యనాథ్ పాలనలో స్పీడు పెంచాడు. ఉదయాన్నే సెక్రటేరియట్ కెళ్లి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో కనిపించిన పాన్ మాసాల, గుట్కాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే వాటన్నింటిని నిషేధిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు.. యూపీలో గోవధను నిషేధిస్తూ అనుమతి లేనివాటిపై ఉక్కు పాదం మోపారు.

అంతేకాదు యూపీ ప్రజలు దేనికోసమైతే బీజేపీకి పట్టం కట్టారో ఆ కలను సాకారం చేసే దిశగా యూపీ సీఎం పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, పోలీసుల ఆగడాలకు చెక్ పెట్టారు. యూపీలో వెంటనే శాంతి భద్రతలు పటిష్టం చేయాలని ఆదేశాలిచ్చారు. అవినీతి పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే పోలీసుల బదిలీలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. కేబినెట్ మీటింగ్ జరిగాక వీటన్నింటిపై అదేశాలు ఇచ్చారు సీఎం ఆదిత్యనాథ్.

ఆ తర్వాత తన తండ్రిని బిస్త్ ను కలిసిన యూపీ సీఎం.. తండ్రి చెప్పిన మాటలు విని ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ‘బురఖా వేసుకున్న ముస్లిం మహిళలు కూడా నీకే ఓటేశారని.. వారికి శరాఘాతంగా మారిన తలాక్ ను తీసేస్తావనే నమ్మకం.. వారి పై దాడులను అరికడతావనే వేశారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో.. ’ హిందుత్వమే కాదు.. అన్ని మతాలను సమానంగా చూసి మతసహనం పాటించు అని తండ్రి హితబోధ చేశాడు. ఈ విషయాన్ని తూచా తప్పకుండా చేస్తానని యోగి పేర్కొనడం గమనార్హం.

To Top

Send this to a friend