బాలీవుడ్‌లో చిత్రంపై వింతగా స్పందించిన ప్రభాస్‌


‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగి పోయింది. బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాతలు మరియు దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ విషయం జాతీయ మీడియాలో కూడా వచ్చింది. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ రెండు చిత్రాలను ప్రభాస్‌తో నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా హిందీ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్‌లో ప్రభాస్‌తో సినిమాను తెరకెక్కించేందుకు ప్రభాస్‌ కూడా ఆసక్తిగా ఉన్నాడని, ఇటీవలే స్వయంగా ప్రభుదేవా కలిసి ప్రభాస్‌ను ఆ విషయమై సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘సాహో’ చిత్రం షూటింగ్‌ నిమిత్తం ముంబయిలో ఉన్న ప్రభాస్‌తో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. జాతీయ మీడియా ప్రభాస్‌ను బాలీవుడ్‌లో చిత్రాల గురించి స్పందించాల్సిందిగా కోరింది. అందుకు ప్రభాస్‌ నవ్వేశాడట. కరణ్‌ జోహార్‌ రెండు చిత్రాలను మీతో నిర్మించేందుకు అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో ఎంత నిజం ఉంది అంటూ రిపోర్టర్‌ ప్రశ్నించగా ఆ విషయాన్ని కరణ్‌ జోహార్‌నే అడగండి అంటూ వింతగా సమాధానం ఇచ్చాడు.

ప్రభుదేవ వచ్చి కలిసిన విషయాన్ని కూడా ప్రభాస్‌ మీడియాకు చెప్పేందుకు అంగీకరించలేదు. ప్రభాస్‌ బాలీవుడ్‌లో చిత్రం గురించి ఇప్పటి వరకు నోరు తెరిచి చెప్పింది లేదు. అంటే బాలీవుడ్‌లో ప్రభాస్‌ సినిమా ఉండటం అనుమానమే అని కొందరు అంటున్నారు. కాని ‘సాహో’ చిత్రం తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న సినిమా ఖచ్చితంగా హిందీ చిత్రమే అని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరంలో ప్రభాస్‌ తర్వాత సినిమా గురించి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend