పవర్ వార్- ‘షాక్’

 

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో లొల్లి. అదే విద్యుత్ సరఫరాల కోసం బకాయి పడ్డ సొమ్ములు చెల్లించాలని ఇరు రాష్ట్రాలు లేఖలు రాసుకున్నాయి. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని మొదట ఏపీ ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసింది. ‘కట్ చేస్తే చేయండి.. ముందు మీరే మా బకాయి చెల్లించండి’ అని కేసీఆర్ ప్రభుత్వం ఏపీకి సమాధానమిచ్చింది. దీంతో ఇరు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్ ను పక్కరాష్ట్రానికి సరఫరా చేయడాన్ని నిలిపివేస్తున్నాయి.

రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం విద్యుత్ సరఫరా చేస్తున్నందుకు గాను తమకు బకాయి పడ్డ రూ.4,440 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని.. అంతవరకు తెలంగాణకు కరెంట్ కట్ చేస్తామని లేఖ రాసింది. ప్రస్తుతం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి తెలంగాణకు 1500 మెగావాట్లకు పైగా విద్యుత్ సరఫరా అవుతోంది.. తెలంగాణ నుంచి 1100 మెగావాట్ల విద్యుత్ ఏపీకి సరఫరా అవుతోంది.

ఏపీ లేఖకు స్పందించిన కేసీఆర్ సర్కారు.. ఏపీకి విద్యుత్ సరఫరా చేసినందుకు బకాయిపడ్డ 1676కోట్లను ముందు చెల్లించాలని ఏపీకి బదులిచ్చింది. లేకపోతే తాము సైతం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొంది. దీంతో ఈ వివాదం ఎటూ తేలదని తెలిసి ఏపీ, తెలంగాణలు విద్యుత్ పంపిణీని ఇరు రాష్ట్రాలకు ఒకరికొకరు నిలిపివేసుకున్నాయి.

ఈ పవర్ వార్ లో చంద్రబాబుకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన బకాయి 4440 కోట్లు. తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన బకాయి 1676 కోట్లు. అంటే ఇంకా 2800 కోట్లు తెలంగాణనే చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ తెలివిగా ఏపీ కరెంట్ బంద్ చేస్తే తాము చేస్తామని చెప్పి బకాయిల విషయంలో లాభపడ్డారు.

తెలంగాణకు ఏపీ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ ను పోలిస్తే ఓ 400 మెగా వాట్ల విద్యుత్ తక్కువ పడుతుంది. దీన్ని ఇటీవల కనెక్టివిటీ కలిగిన చత్తీస్ ఘడ్ నుంచి కొనుగోలు చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఈ బకాయిల లొల్లి అంతిమంగా తెలంగాణకే లాభం చేకూర్చేలా ఉందని.. ఏపీ విద్యుత్ బంద్ చేసినా సరే తెలంగాణ 2800 కోట్ల లాభంతో పాటు చత్తీస్ ఘడ్ విద్యుత్ అందుబాటుతో ఆ సమస్య ఉండదని విద్యుత్ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఖరీఫ్ వేళ.. ఇప్పుడు వ్యవసాయానికి ఇరు రాష్ట్రాల్లో డిమాండ్ అత్యదికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ బకాయిలు 4440 కోట్లు రాబట్టాలని ఏపీ సర్కారు వేసిన పాచిక కేసీఆర్ ముందు పారలేదు. పైగా 2800 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇప్పుడు తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేసి తప్పు చేశామా అన్న మీమాంస చంద్రబాబు సర్కారులో ప్రస్ఫుటంగా కనిపిస్తోందట..

To Top

Send this to a friend