పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తున్న ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్వీట్ వచ్చినా దానిని పట్టించుకోవద్దని జనసేన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ కాకపోవడంతో అకౌంట్ హ్యాక్ అయ్యిందని పవన్ కళ్యాణ్ గుర్తించారని జనసేన పేర్కొంది. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ పై సైబర్ నిపుణులతో జనసేన చర్చించి బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు పవన్ ఫిర్యాదు చేశాడు. అకౌంట్ ను పునరుద్ధరించే వరకు పవన్ ట్వీట్లపై జనం, అభిమానులు స్పందించవద్దని సూచించారు.
ప్రజాసమస్యలపై ఎప్పుడూ స్పందించే పవన్.. మరోసారి తెలంగాణలోని ఉద్రిక్తతలపై స్పందించాలని యోచించారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ ఆందోళనలపై స్పందించడానికి ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కు పాస్ వర్డ్ చేంజ్ అనే ఆప్షన్ వచ్చినట్టు తెలిసింది. మూడు రోజుల క్రితం ట్విట్టర్ ఓపెన్ చేస్తే కాలేదు. సరేలే అని ఈరోజు ఓపెన్ చేస్తే హ్యాక్ చేసినట్టు పవన్ కు అర్థమైంది. దీంతో సైబర్ క్రైం పోలీసులకు ఈ విషయం ఫిర్యాదు చేయడానికి పవన్ సంప్రదించినట్టు తెలిసింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఖాతాకు దాదాపు 18 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే సైబర్ దొంగలు ఆయన అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈ మూడురోజులు హ్యాకర్లు ఏ ట్వీట్ చేసినా పవన్ పైనే నెపం వస్తుంది. అందుకే పవన్ ట్వీట్లను ఈ మూడు రోజులు జనం, అభిమానులు పరిగణలోకి తీసుకోవద్దని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
