పవన్ రగిల్చిన ప్రత్యేక హోదా..


పవన్ మళ్లీ వేడి రగిల్చారు. పార్లమెంటు వేధికగా ఏపీ ప్రత్యేక హోదాపై జరుగుతున్న చర్చలో ఎవరెవరు ఏఏ పాత్రలు పోషిస్తున్నారో పేర్లు చెప్పి మరీ తూర్పారపట్టాడు. తెలంగాణ, వైసీపీ ఎంపీలను పొగుడుతూ టీడీపీ ఎంపీల తీరును ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వంలో సీనియర్ నేతగా.. టీడీపీ తరఫున కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు ఏపీ ప్రత్యేక హోదా చర్చకు రాకపోవడాన్ని పవన్ తీవ్రంగా విమర్శించారు..

ఢిల్లీ పార్లమెంటు వేదికగా జరుగుతున్న పరిణామాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ ఎంపీల తీరును కడిగేశాడు.. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుగా మాట్లాడిన తెలంగాణ ఎంపీలు కేశవరావు, రాపోలు ఆనంద భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో పార్లమెంటులో ఏపీ ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని, పోరాడుతున్న వైసీపీని వేయినోళ్ల పొగిడారు.

తెలుగుదేశం ఎంపీలకు ఉత్తరాది ఎంపీల చేతిలో గతంలో పార్లమెంటులో తెలంగాణ విడిపోయినప్పుడు దెబ్బలుతిన్న విషయాన్ని మరిచిపోయారని.. అందుకే ఇప్పటకి పార్లమెంటులో తమకు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై పల్లెత్తు మాట మాట్లాడడం లేదని పవన్ దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై ప్రతి సారీ బీజేపీ ఇచ్చేది లేదు అని స్పష్టం చేస్తున్నా.. ఇంకా పదవులు పట్టుకొని వారి మోచేతి నీళ్లు తాగే కర్మ తెలుగుదేశం ఎంపీలకు ఎందుకుపట్టిందని పవన్ నిలదీశారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టవద్దని ప్రత్యేక హోదా కోసం చర్చలో పాల్గొని సాధించేవరకు విశ్రమించవద్దని పవన్ ట్వీట్లలో ఆవేశంగా వ్యాఖ్యానించారు.

To Top

Send this to a friend