‘జాతి, మతం, కులం కోసం ఈ మధ్య చాలామంది పోరాటాలు చేస్తున్నారు. కానీ సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఆ సమస్యను ఎలుగెత్తి చాటడం లేదు. ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి ఒక్క నాయకుడైనా పోరాడుతున్నాడా..?’ అంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు పవన్ పరోక్షంగా గట్టి చురకలు అంటించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పరిశోధనకు వచ్చిన అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయ వైద్యులతో పవన్ విశాఖపట్నంలో ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ ఏపీ రాజకీయాల కోణంలో పొలిటికల్ పంచ్ విసిరారు..
ఉద్దానం సమస్యపై తాను నిజాయితీతో పోరాడుతున్నాని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఈ సమస్యను లేవనెత్తడం లేదని.. కిడ్నీ బాధితులకు అండగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ క్రెడిట్ టీడీపీకి పోతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని.. క్రెడిట్ ఎవరికీ పోయినా తనకు కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం మాత్రమే కావాలని స్పష్టం చేశారు.
ఉద్దానం సమస్యను పరిష్కరించాలని హార్వర్డ్ విశ్వవిద్యాలయ వైద్యుల బృందం రూపొందించిన నివేదికతో సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబును కలుస్తానని.. ఆయన స్పందించకుంటే ప్రతిపక్షాలతో కలిసి పోరాటం చేసేందుకైనా తాను రెడీ అని స్పష్టం చేశారు. ఇలా పవన్ ఉద్దానం సమస్యపై అటు రాజకీయ నాయకులకు చురకలంటించారు. ఇటు అధికార, ప్రతిపక్షాలను డిఫెన్స్ లో పడేశారు.
