స్వామిభక్తిలో కట్టప్పను మించిన పరకాల

కట్టప్ప.. మహిష్మతి రాజ్యానికి కట్టు బానిస.. రాజమాత, రాజు ఏం చెప్తే అది చేశాడు. ఆఖరుకు తను పెంచిన బాహుబలిని చంపేశాడు. విశ్వాసానికి మారు పేరుగా నిలిచిన కట్టప్ప పాత్రలోకి ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ చేరిపోయారు. టీడీపీ నేతలు ఎవ్వరికీ రాని ఐడియాను ఆయన మహానాడు వేదికగా ప్రకటించి సంచలనం సృష్టించాడు.

పరకాల ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ నాయకుడూ కాదు.. మంత్రి, ఎమ్మెల్యే కాదు.. కేవలం ఏపీ ప్రభుత్వ సలహాదారు.. భార్య నిర్మలా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా బీజేపీలో కొనసాగుతున్నారు. దీంతో నిధులు గట్రా సాధించుకునేందుకు వీలుగా చంద్రబాబు… నిర్మల భర్త అయిన ప్రభాకర్ ను ఏరికోరి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు.. దీంతో ప్రభాకర్ ఇప్పుడు ఏపీ పరిపాలనలో అంతకుమించి ఇన్ వాల్వ్ అవుతున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరకాల  స్వామి భక్తిలో కట్టప్పతో సమానంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం టీడీపీలో సాగుతోంది..

చంద్రబాబుకు కట్టప్పగా పరకాల అన్ని విషయాల్లోనూ టీడీపీని ఆదుకుంటూనే ఉన్నారు. అసలు ప్రభుత్వ సలహాదారుగా టీడీపీకి అంతకుమించి అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పరకాల ప్రభాకర్ మహానాడు సందర్భంగా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టడం కలకలం రేగింది. ఆయన టీడీపీ ప్రజాప్రతినిధి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ కాదు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ మహానాడులో తీర్మానించడం వేదికపైనున్న టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. మైక్ అందుకొని ఇలా ప్రకటించడంతో స్టేజ్ మీదున్న వాళ్లంతా అవాక్కయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ తీర్మానాన్ని పరకాల ప్రవేశపెట్టడంలో తప్పులేదని .. ప్రభుత్వ సలహాదారు పదవి ఆయనకు రాజకీయంగా ఇచ్చిందేనని చెప్పడం కొసమెరుపు..  ఎంతైనా ఇప్పుడు పరకాల స్వామి భక్తి కట్టప్పను గుర్తుకుతెస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.

To Top

Send this to a friend