కోయదొరల చేతిలో 57లక్షలు మోసపోయిన ఎమ్మెల్యే

అతడు అధికార పార్టీ ప్రజాప్రతినిధి.. పైగా పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా.. పోలీసులు… మందీ మార్బలం.. ఆర్ధిక అండదండలు పుష్కలంగా ఉన్న ఎమ్మెల్యేను ఇద్దరు కోయదొరలు ఇంటికొచ్చి పూజలు చేసి మరీ మోసం చేశారు. ఎమ్మెల్యేను మోసం చేశారు అని అనడం కంటే మూఢనమ్మకాలతో ఎమ్మెల్యే ఫ్యామిలీయే మోసం పోయిందంటే కరెక్ట్ గా ఉంటుంది. ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామని పూజలు చేసి ఏకంగా 57 లక్షలు కోయదొరలు కాజేయడం తెలంగాణలో సంచలనంగా మారింది.. అసలు విషయానికి వస్తే..

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి ఇద్దరు కోయదొరలు టోకరా వేశారు. పూజలు చేస్తే తన తండ్రికి మంత్రి పదవి వస్తుందని… ఎమ్మెల్యే కుమార్తె మానస రెడ్డి… ఇద్దరు కోయదొరలను సంప్రదించారు.

కాశీలో పూజలు చేస్తే మంత్రి పదవి వస్తుందంటూ కోయదొరలు ప్రలోభపెట్టి… ఆమె వద్ద నుంచి సుమారు రూ.57 లక్షలు వసూలు చేశారు. ఈ విషయం ఆలస్యంగా ఇంట్లో వారికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసిన కోయదొరలు లక్ష్మణరాజు, వంశీరాజులపై 420, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ ను నమ్మితే మంత్రిపదవి వస్తుందని కానీ ఇలా కోయదొరలను నమ్ముకుంటే రాదని తోటి నాయకులు ఎమ్మెల్యేకు సెటైర్లు వేస్తున్నారంటే.. ఏదీ ఏమైనా ఇప్పుడు 57లక్షలు మునిగి ఎమ్మెల్యే ధర్మారెడ్డి బావురుమంటున్నాడట..

To Top

Send this to a friend