కథ సుఖాంతం.. కలిసిపోయిన ‘అమ్మ’శిష్యులు

తమిళనాట ఉత్కంఠకు తెరపడింది. నాలుగు నెలలుగా విడిపోయిన మాజీ సీఎం అమ్మ జయలలిత శిష్యులు సామరస్యంగా కలిసిపోయారు. సీఎం ఫళని స్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు కలిసిపోయి శశికళకు షాక్ ఇచ్చారు. మొత్తం గా శశికళను ఈ కలయికతో అన్నాడీఎంకే నుంచి శాశ్వతం గా పంపించినట్టే అర్థమవుతోంది.

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి తరువాత తమిళనాడులో రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. అమ్మ మరణం తర్వాత సీఎంగా అమ్మకు వీర విధేయుడు పన్నీర్ సెల్వంను నియమించారు. అయితే పన్నీర్ ను రెండు నెలల వ్యవధిలోనే తొలగించి అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని జయ నెచ్చలి శశికళ భావించారు. అయితే పన్నీర్ ఎదురుతిరిగి తిరుగుబావుటా ఎగురవేయడంతో శశికళ ఖంగుతింది. మరో వైపు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళను దోషిగా నిర్దారించింది. దీంతో అనుచరుడైన ఫళనిస్వామిని సీఎం సీట్లో కూర్చోబెట్టి శశికళ జైలుకు వెళ్లిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య అన్నాడీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. ఫళని స్వామి సీఎంగా .. పన్నీర్ తిరుగుబాటు చేసి వర్గాలుగా చీలిపోయారు. తరువాత ఇన్నాళ్లకు మళ్లీ సోమవారం ఒక్కటయ్యారు..

ఈరోజు చైన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సమావేశమైన పాత మిత్రులు ఫళని స్వామి, పన్నీర్ సెల్వంలు ఇరు వర్గాలు విలీనం అయినట్టు ప్రకరించారు. సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వంకు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు పార్టీ ముఖ్య మార్గదర్శక కమిటీకి చైర్మన్ ను కూడా చేశారు. ఫళని, పన్నీర్ విలీనం కావడంతో శశికళకు ఊహించని షాక్ తగిలింది. దీంతో శశికళకు అన్నాడీఎంకే పార్టీపై ఉన్న పట్టు కోల్పోయినట్టు అయ్యింది

To Top

Send this to a friend