మా పిల్లలు సర్కారీ బడికే: పోతారం గ్రామం

 

అబ్దుల్ కలాం, ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్, ఓ నరేంద్రమోడీ, ఇలా దేశం గర్వించే శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు, అధికారులు, ఐఐటీయన్లందరూ తమ బాల్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే.. అంతెందుకు ప్రస్తుతం 30 ఏళ్లు పైబడి ఉన్నవాళ్లందరూ దాదాపు ప్రభుత్వ బడుల్లోనే చదివారు. 30 ఏళ్ల క్రితం గ్రామాలన్నింటిలో ప్రభుత్వ బడులే ఉండేవి. ఈ 15 ఏళ్లలోనే ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలలు వెలిసి విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ బాట పట్టింది . చదువులు ఖరీదైనవి అయ్యాయి. ఇప్పుడున్న విద్యార్థులవన్నీ బట్టీ చదువులే.. సమాజంపై అవగాహన, రాజకీయ, సామాజిక పరిస్థితులు, దేశ పరిస్థితులాంటివేవి తెలియవు. ఇంత భ్రష్టు పట్టిస్తున్న ప్రైవేటు విద్యకు వ్యతిరేకంగా ఓ గ్రామం ఒక్కటైంది. గ్రామస్థులందరూ ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపాలని తీర్మానించి అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

* ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తే రూ.50వేల జరిమానా..
స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్ అనుకునే రోజులివి. సర్కారీ బడులను హేళనగా చూసే రోజులు. స్మార్ట్ లుక్ ఉండదని.. టీచర్లు పట్టించుకోరని.. అవి కేవలం వీధిబడులు మాత్రమేనని అనుకునే రోజులివి.. అలాంటి సమయంలో ఇదిగో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి.. లేదంటే భారీ జరిమానా తప్పదంటూ ఆ గ్రామమంతా తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లపై ఎంత మమకారం ఉండాలి. గవర్నమెంట్ స్కూళ్లను బతికించుకోవడానికి.. ఆగ్రామం చూపిన సాహసం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని పోతారం గ్రామం ఈ ఆదర్శానికి బాటలు వేసింది. గ్రామమంతా ఒక్కటై.. తమ గ్రామం నుంచి ప్రైవేట్‌ పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. కులసంఘాల వారీగా సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. సర్పంచ్‌ సిరికొండ కవితకు తీర్మాన పత్రాలను అందించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూతపడే పరిస్థితి నెలకొనడంతో ఈ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు

గ్రామస్థులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడంతోనే ఊరుకోలేదు.. అందులో ఉపాధ్యాయుల కొరత ఉంటే తలా కొంత వేసుకొని ఇంగ్లీష్ వచ్చిన విద్యావలంటీర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే జీతంతో పాటు వీరు జమ చేసి ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉన్న ఉపాధ్యాయులను నియమించుకొని పిల్లలకు బోధింప చేస్తున్నారు. ఇలా ఓ గ్రామం ప్రైవేటు చదువులకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడి విజయం సాధించింది. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యనందిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

To Top

Send this to a friend