ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రం టీజర్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఆ మూడు పాత్రలకు సంబంధించి మూడు టీజర్లను విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించి, మొదటి టీజర్‌ను ఈనెల ఆరున అంటే రేపు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.
రేపు విడుదల కాబోతున్న టీజర్‌ను ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంథు నేడే చూసేశాడట. తాజాగా ఆయన ట్విట్టర్లో ఈ విషయమై స్పందించాడు. ఎన్టీఆర్ ‘జైలవకుశ’ మొదటి టీజర్ అదిరిపోయిందని, ఎన్టీఆర్ లుక్‌తో పాటు, ఆయన బాడీలాంగ్వేజ్ మరియు ఇతరత్ర అంశాలు ఔట్ స్టాడ్గా ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. ఆయన రివ్యూ వింటుంటే సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా ముద్దుగుమ్మలు రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లు నటించారు. మూడు పాత్రల్లో ఒక పాత్ర నెగటివ్ చాయలతో ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధికంగా ఈ సినిమా 120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌ను చేసింది. ఈ నెంబర్ చాలు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. రేపు విడుదల కాబోతున్న టీజర్‌కు సంబంధించిన వార్తలు వెంట వెంటనే మీ ముందుకు తీసుకు వస్తూ ఉంటాం.
