మహేష్‌ నో చెప్తే.. ఎన్టీఆర్‌ ఓకే అన్నాడు!

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌ బాస్‌ షోను తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా చేసేందుకు మాటీవీ సిద్దం అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ దాదాపు 7 కోట్ల పారితోషికాన్ని మొదటి సీజన్‌కు అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ త్వరలోనే బిగ్‌బాస్‌ షో కోసం సిద్దం అవ్వబోతున్నాడు. ప్రస్తుతం జై లవకుశ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత బిగ్‌ బాస్‌ షోలో పాల్గొంటాడని మా వర్గాల వారు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ ఆఫర్‌ ముందుగా మహేష్‌బాబు వద్దకు వెళ్లినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

టాలీవుడ్‌లో భారీ క్రేజ్‌ ఉన్న స్టార్‌ హీరో మహేష్‌బాబు. అందుకే మొదట మహేష్‌బాబు వద్దకు మాటీవీ వారు వెళ్లారని, అయితే ఇలాంటి రియాల్టీ షోలను హోస్ట్‌ చేయడం తన వల్ల కాదని, బుల్లి తెరపై తనకు ఆసక్తి లేదని చెప్పడంతో ఆ ఆఫర్‌ కాస్త ఎన్టీఆర్‌ను వరించింది. ప్రేక్షకులతో ఇంటరాక్ట్‌ అవ్వడంతో పాటు, ఎన్టీఆర్‌లో మంచి మాటకారి తనం ఉన్న నేపథ్యంలో ఆయన అయితే తప్పకుండా బిగ్‌ బాస్‌ షోకు న్యాయం చేస్తాడని మా టీవీ వర్గం వారు భావించారు.

మాటీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్న ఈ షోను సక్సెస్‌ చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎన్టీఆర్‌ నమ్మకంతో చెబుతున్నాడు. ప్రస్తుతం స్టార్స్‌ దాదాపు అంతా కూడా బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తిని కనబర్చుతున్నారు. ఎన్టీఆర్‌ బుల్లి తెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో అనేది చూడాలి.

To Top

Send this to a friend