ఎన్టీఆర్ ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ఎన్టీఆర్ తర్వాత చిత్రం గురించి జోరుగా ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తర్వాత సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలైన వెంటనే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోతున్న ఆ భారీ చిత్రంలో మరో హీరో నారా రోహిత్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హీరోగా మరియు విలన్గా దూసుకు పోతున్న నారా రోహిత్ త్వరలోనే ఎన్టీఆర్ చిత్రంలో నటించనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్ల క్రితం తనకు బాలకృష్ణ, ఎన్టీఆర్లతో కలిసి నటించాలనే కోరిక ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. వారి సినిమాల్లో ఏ పాత్రలు అయినా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఆ వ్యాఖ్యలు బేస్ చేసుకుని ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో నారా రోహిత్ నటించబోతున్నాడు అంటూ వార్తలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలు ఆలూలేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉంది. ఇంకా ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ అధికారిక ప్రకటన రానే లేదు. అప్పుడే నారా రోహిత్ ఆ సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.
