చిన్నదేం కాదన్న జక్కన్న


టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే తన తర్వాత సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో జక్కన్న ఒక చిన్న చిత్రాన్ని చేయాలని భావిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి జక్కన్న తన తర్వాత సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చాడు.

తన తర్వాత సినిమా ఫిక్స్‌ కాలేదని, ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథను సిద్దం చేస్తున్నాడని, ఒక మంచి ఎమోషనల్‌ డ్రామా ఉండే కథను సిద్దం చేయాల్సిందిగా తాను కోరినట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. కథ సిద్ద అయిన తర్వాత హీరో, హీరోయిన్‌ గురించి ఆలోచిస్తాను అంటూ జక్కన్న పేర్కొన్నాడు. ఇక తాను ఒక చిన్న చిత్రాన్ని తీస్తానని చెప్పలేదని, గ్రాఫిక్స్‌ లేకుండా సినిమా చేస్తానంటూ చెప్పానని జక్కన్న అన్నాడు. గ్రాఫిక్స్‌ లేనంత మాత్రన తాను చేయబోతున్న సినిమా చిన్న చిత్రంగా ఎలా పరిగణిస్తారు అంటూ జక్కన్న ప్రశ్నిస్తున్నాడు.

రాజమౌళి తన తర్వాత సినిమాను డివివి దానయ్య నిర్మాణంలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం దానయ్య వద్ద రాజమౌళి అడ్వాన్స్‌ తీసుకున్నాడు. ఆ కారణంగానే దానయ్య నిర్మాణంలో సినిమా చేయాలని జక్కన్న ఫిక్స్‌ అయ్యాడు. దాదాపు 75 కోట్ల బడ్జెట్‌తో జక్కన్న తర్వాత సినిమా ఉంటుందనే చర్చ జరుగుతుంది.

To Top

Send this to a friend