వాయిదా వేసేది లేదన్న నాగ్‌

అక్కినేని నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా ‘సోగ్గాడే చిన్ని నాయనో’ ఫేం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌లో ఉంది. నిన్న ఆడియో విడుదల అవ్వాల్సి ఉండగా అక్కినేని ఫ్యామిలీ కుటుంబ సభ్యుడు అయిన సూర్యభూషణ రావు చనిపోవడంతో వేడుకను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఆడియోను రద్దు చేయడంతో ఈనెల 26న విడుదల కావాల్సిన సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆడియో వేడుకను వచ్చే వారంలో నిర్వహించిన, సినిమాను అనుకున్న డేట్‌ కంటే వారం రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్మాత నాగార్జున అండ్‌ టీం భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా వాయిదా పడబోతుంది అన్నట్లుగా వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకి వచ్చి తీరుతుందని నాగార్జున కూడా సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.

‘సోగ్గాడే చిన్ని నాయనో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న కళ్యాణ్‌ కృష్ణ మరోసారి ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కట్టి పడేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు మరింత ఉత్సాహంతో విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో వేడుక రద్దు అయిన నేపథ్యంలో పాటలను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

To Top

Send this to a friend